calender_icon.png 30 January, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొహెడ మార్కెట్‌కు గ్రీన్ సిగ్నల్?

09-12-2024 12:56:27 AM

  1. నూతన ఏడాదిలో పండ్ల మార్కెట్ నిర్మాణ పనుల శంకుస్థాపనకు కసరత్తు 
  2. గత ప్రభుత్వంలో 314 కోట్లు కేటాయింపు
  3. బాటసింగారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్‌తో ఇబ్బందులు
  4. మార్కెట్ నిర్మాణంపై రైతులు, వ్యాపారుల గంపెడాశలు

రంగారెడ్డి, డిసెంబర్ 8 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్‌మెట్ మండలంలోని కొహెడలో అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వంలో రూపొందించిన డీపీఆర్‌కు మరికొన్ని మార్పులు చేసి పండ్ల మార్కెట్‌తో పాటుగా పూలు, డెయిరీ, కూరగాయలకు సంబంధించిన మార్కెట్‌ను కూడా అక్కడే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకొంది.

అందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి మార్కెట్ శాఖ అధికారులకు సూచనలు చేశారు. దీంతో మార్కెట్ శాఖ అధికారులు అంతర్జాతీయ స్థాయి మార్కెట్ నిర్మాణం కోసం డీపీఆర్‌లో మరిన్ని మార్పులు చేర్పులు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్  దేశంలోనే మంచి గుర్తింపు పొందింది.

దేశం నలుమూలల నుంచి సీజన్‌ల వారిగా పండే వివిధ రకాల పండ్లు ప్రతినిత్యం ఇక్కడి మార్కెట్‌కు వస్తాయి. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు పెద్దఎత్తున తరలివచ్చేవి. దీంతో ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యేవి. పండ్ల మార్కెట్‌కు ప్రతి నిత్యం వచ్చీపోయే వ్యాపారులు, రైతుల సంఖ్య పెరిగిపోవడంతో స్థల సమస్య ఏర్పడింది.

ఈ విషయమై గత పాలకమండలి సభ్యులు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన గత ప్రభుత్వం గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను 2021 అక్టోబర్‌లో బాటసింగారం వద్దకు తాత్కాలి కంగా తరలించింది. అలాగే శాశ్వత ప్రాతిపాదికన అంతర్జాతీయ స్థాయిలో కొహెడలో పండ్ల మార్కెట్‌ను నిర్మించేందుకు అనువైన స్థలాన్ని కూడా గుర్తించింది.

దాని నిర్మాణానికి రూ.314 కోట్ల నిధులను సైతం మార్కెట్ ఖాతాలో జమచేసింది. కొహెడలో శాశ్వత మార్కెట్ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా అక్కడ షెడ్లను ఏర్పాటు చేసింది. అయితే గతంలో కురిసిన వర్షాలు, గాలివాన కారణంగా తాత్కాలికంగా నిర్మించిన షెడ్లన్నీ కూలిపోయ్యాయి. దీంతో రైతు లు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.

దీంతో ప్రభుత్వం పూర్తిస్థాయి మార్కెట్ నిర్మాణం అయ్యేంత వరకు బాట సింగారంలో తాత్కాలికంగా షెడ్డులను నిర్మించింది. అక్కడి నుంచే గత మూడేళ్లుగా బాటసింగారంలో పండ్ల  మార్కెట్ కొన సాగుతోంది.

కొహెడలో మార్కెట్ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలోపే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటీవలనే గడ్డిన్నారం పండ్ల మార్కెట్‌కు పాలకమండలి ఏర్పాటు కావడంతో మళ్లీ పండ్ల మార్కెట్ నిర్మాణంపై అందరి దృష్టి పడింది.

అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ నిర్మాణం..

అంతర్జాతీయ స్థాయిలో కోహెడలో పండ్ల మార్కెట్ నిర్మించేందుకు అధికారులు కసరత్తులు చేశారు.  రాష్ట్రంలో ఉన్న 65 వ్యవసాయ మార్కెట్ల నుంచి రూ.314 కోట్ల నిధులను సేకరించి మార్కెట్ ఖాతాలో జమచేసింది. మార్కెట్ నిర్మాణం కోసం మొత్తం 199 ఎకరాలను సేకరించి నిర్మాణానికి అనుగుణంగా భూమిని కేటాయించారు.

అందులో 48 ఎకరాలలో షెడ్ల నిర్మాణం, మార్కెట్లో వ్యాపారం చేసే కమీషన్ ఏజెంట్ల దుకాణాలు, 16.50 ఎకరాలలో కోల్డ్‌స్టోరేజీల నిర్మాణం, 11.76 ఎకరాల్లో పండ్ల  ఎగుమతులకు ఎక్స్‌పోర్ట్ జోన్ 56.54 ఎకరాల్లో రోడ్ల నిర్మాణం, 11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కోసం రూ.400 కోట్ల  వ్యయం అంచనాలతో డీపీఆర్‌ను సిద్ధం చేసి నివేదికను అందజేశారు. 

మరో 45 ఎకరాల భూసేకరణ..

గతంలో రూపొందించిన డీపీఆర్‌లో కొన్ని మార్పులు చేయాలని ఇటీవల సీఎం రేవంత్ సూచించినట్లు పండ్లమార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. గతంలో సేకరించిన 119 ఎకరాలకు అదనంగా మరో 45 ఎకరాలను సేకరించాం. ఇప్పటికే 35 ఎకరాల వక్ఫ్‌బోర్డుకు చెందిన భూములతో పాటుగా మరో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పదెకరాలను గుర్తించి భూ సేకరణకు సంబంధించి శాటిలైట్ సర్వే పూర్తి చేసి జిల్లా కలెక్టర్, మార్కెటింగ్ అధికారులకు నివేదించాం.

అనంతరం సంబంధిత అధికారులు డీపీఆర్‌కు అనుమతి ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అదనంగా సేకరిస్తున్న 45 ఎకరాలో పూలు, డెయిరీ ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వం సానుకూలంగా ఉంది

కొహెడలో పండ్లమార్కెట్ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. గత ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్‌లో మరిన్ని మార్పులు చేర్పులు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కేవలం పండ్ల మార్కెట్  కాకుండా సమీకృత మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

అందుకోసం పూర్తిస్థాయి డీపీఆర్‌ను రూపొందిస్తున్నాం. వచ్చే ఏడాది జనవరిలో నూతన సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. నూతన మార్కెట్ నిర్మాణం కోసం పాలకమండలి సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేసి వారి సూచనలు, సలహాలు తీసుకున్నాం. 

చిలుక మధుసూదన్‌రెడ్డి, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ చైర్మన్