- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- మూడు క్యాటగిరీలకు విడివిడిగా మార్గదర్శకాలు
- సర్కారు నిర్ణయంపై టీచర్స్ సంఘాల అసంతృప్తి
హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): 317 జీవో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు క్యాటగిరీల్లోని ఉద్యోగుల బదిలీలకు అనుమతులిచ్చింది. ఈ మేరకు వేర్వేరుగా మార్గదర్శకాలతో కూడిన మూడు జీవోల(243, 244, 245)ను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.
317 జీవో క్యాబినెట్ సబ్‌కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా బదిలీలు మాత్రమే చేయాలని నిర్ణయించింది. మెడికల్, స్పౌజ్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మూడు క్యాటగిరీల కు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలను జారీ చేశారు. ఖాళీలకు లోబడి స్థానిక కేడర్‌లో మార్పు, బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. 317 జీవో కారణంగా కొంతమంది ఉద్యోగులు, టీచర్లకు నష్టం వాటిల్లింది. దీంతో దీనిపై క్యాబినెట్ సబ్‌కమిటీ వేసిన ప్రభుత్వం మూడు క్యాటగిరీల వారినే బదిలీ చేయాలని నిర్ణయించడంతో పలు టీచర్ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
గత ప్రభుత్వంలో కొన్ని జిల్లాల్లో బదిలీలు చేపట్టగా, మరికొన్ని జిల్లాల్లో పెండింగ్ పెట్టింది. వీరికి కూడా బదిలీ చేయాల్సి ఉండగా అవకాశం ఉన్న మేరకే చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రాధాన్యతా క్యాటగిరీలో కారుణ్య నియామకాల ద్వారా నియామకమైన వితంతువులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని జీవోలో ఉన్న అంశాన్నే కమిటీ పేర్కొనడాన్ని టీఎస్‌యూటీఎఫ్ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.
పరస్పర బదిలీల్లో ఒకరు తప్పనిసరిగా 317 జీవో ద్వారా గతంలో ప్రభావితమై ఉండాలనే నిబంధనను పెట్టడం సరైంది కాదని యూనియన్ నేతలు చెప్తున్నారు. స్థానికత మారితే సీనియార్టీ కోల్పేయే నిబంధనను యథాతథంగా ఉంచారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్పౌజ్‌ల గురించి ప్రస్తావించలేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. గత పది నెలలుగా ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు 317 బాధితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తర్వులు సవరించాలి: టీఆర్టీఎఫ్
ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులతో 317 జీవో బాధితులకు ఎలాంటి ఉపశమనం కలుగలేదని, అదనంగా రివర్స్ స్పౌజ్ అన్నారని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కటకం రమేశ్, అంజిరెడ్డి విమర్శించారు. మ్యూచువల్‌కు మరో సారి అవకాశం తప్ప ఎలాంటి ఉపశమనం ఈ జీవోల ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు దక్కలేదని పేర్కొన్నారు. స్థానికత గురించి ఊసేలేదని, ఆశలు పెట్టుకున్న 317 జీవో బాధితులకు న్యాయం జరిగేలా ఉత్తర్వులు సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు.