- 6 కంపెనీలు.. రూ.5,260 కోట్ల పెట్టుబడులు
- సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబుతో కంపెనీల ప్రతినిధుల భేటీ
- రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న పరిశ్రమలు
- 12,490 మందికి ఉద్యోగావకాశాలు
- ఇప్పటికే గుర్తించిన ఫార్మా సిటీలో స్థలాల కేటాయింపు
- నాలుగు నెలల్లో నిర్మాణ పనులు మొదలు
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు ఫార్మా పెట్టు బడులు వెల్లువెత్తాయి. దేశంలో పేరొందిన ఎంఎస్‌ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీలు తమ కార్యకలాపాల విస్తరణ మాత్రమే కాకుండా, కాలుష్య రహితంగా గ్రీన్ ఫార్మా యూనిట్లను ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చాయి.
ఈ ఆరు కంపెనీలు కలిపి రూ.5,260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ నూతన పెట్టుబడుల ద్వారా 12,490 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమల ఏర్పా టుకు సంబంధించిన ఎంవోయూలపై సంతకాలు చేశారు. ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో ఈ ఆరు కంపెనీలకు అవసరమైన స్థలాన్ని కేటాయించనున్నారు.
నాలుగు నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయా కంపెనీలు తమ యూని ట్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆదేశించారు.
ఎంవోయూల ప్రకారం ఆరు కంపెనీలు ఏర్పాటు చేసే యూనిట్లు ఇవే..
* ఎంఎస్‌ఎన్ లాబోరేటరీ సంస్థ తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో పాటు ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను నెలకొల్పనుంది.
* లారస్ ల్యాబ్స్, అరబిందో సంస్థలు ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు ఏర్పాటు చేస్తాయి.
* గ్లాండ్ పార్మా సంస్థ ఆర్‌అండ్‌డీ సెంటర్, ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్స్టన్స్ మాన్యుఫాక్చర్ యూనిట్లను స్థాపించనుంది.
* డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ఇంజెక్టబుల్, బయో సిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేయనుంది.
* హెటిరో ల్యాబ్స్ ఫినిషిడ్ డోస్, ఇంజక్టబుల్ తయారీ పరిశ్రమను స్థాపించనుంది.
ఈ సమావేశంలో డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ డైరెక్టర్ సతీష్ రెడ్డి, లారస్ ల్యాబ్స్ ఈడీ వీవీ రవికుమార్, గ్లాండ్ ఫార్మా సీఈవో శ్రీనివాస్, ఎంఎస్ ల్యాబ్స్ సీఎండీ ఎంఎస్‌ఎన్ రెడ్డి, అరబిందో డైరెక్టర్ మదన్‌మోహన్ రెడ్డి, హెటిరో గ్రూప్ ఎండీ బి.వంశీకృష్ణ, టీఎస్‌ఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.