పారిస్: ఒలింపిక్ క్రీడల్లో పాల్గొననున్న భారత అథ్లెట్లు పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లు ‘చెఫ్ ది మిషన్’ గగన్ నారంగ్ పేర్కొన్నాడు. పారిస్ క్రీడల్లో భారత్ బృందానికి గగన్ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గగన్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు మన అథ్లెట్ల మైండ్‌సెట్‌లో చాలా మార్పు వచ్చింది. వారి ఆలోచనా విధానం కూడా ఉన్నతస్థాయికి చేరుకుంది. గతంలో ఒలింపిక్స్ అనగానే చాలా ఆందోళనకు గురయ్యేవాళ్లం. ఇతర దేశాలతో పోలిస్తే ఆత్మవిశ్వాసం కూడా తక్కువే. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. కేవలం గేమ్స్‌లో పాల్గొనడమే కాకుండా అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు సాధించేందుకు సిద్ధమయ్యారు. ఒక పతకంతో సంతృప్తి చెందకుండా వీలైనన్ని స్వర్ణ పతకాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. గత నాలుగు ఒలింపిక్స్‌లో అథ్లెట్‌గా పాల్గొన్న నేను ఈసారి బృందాన్ని నడిపించడం గౌరవంగా భావిస్తున్నా. ఇది ఎంతో బాధ్యతతో కూడుకున్నదే. ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతా’ అని నారంగ్ వెల్లడించాడు.