calender_icon.png 20 March, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ యాంత్రీకరణకు పచ్చజెండా

20-03-2025 02:06:40 AM

  • ఇప్పటికే విధివిధానాలు ఖరారు 

తొలి విడత 1,500 మందికిపైగా లబ్ధి

త్వరలో రైతులకు అవగాహన సదస్సులు

నల్లగొండ, మార్చి 19 (విజయక్రాంతి) :  వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికారులు అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆరేండ్ల క్రితం యాంత్రీకరణ పథకం నిలిచిపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నాలు గేళ్లలో బీఆర్‌ఎస్ సర్కారు దాదాపు రూ.50 కోట్లు కేటాయించింది. ఇందులో ఎక్కువగా ట్రాక్టర్లనే మంజూరు చేసింది. వీటిని ఆ పార్టీ కార్యకర్తలకే ఇచ్చినట్లు అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. 

రైతుల ఇబ్బందిని గుర్తించి.. 

2018 నుంచి 2023 వరకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వీటిని గుర్తించి కాంగ్రెస్ సర్కారు పథకాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించింది. తొలి విడతలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,552 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఉత్తర్వులిచ్చింది.

నల్లగొండ జిల్లాలో 820 మంది రైతులకు, సూర్యాపేట జిల్లాలో 457 మంది రైతులకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 275 మంది రైతులకు మొత్తం రూ.3 కోట్ల 50 లక్షల 86 వేలు కేటాయించింది. వ్యవసాయ పరికరాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు త్వరలో (ఈ నెలాఖరు నాటికి) ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయిలో అవగాహన సదస్సులు, ప్రదర్శనలు నిర్వహించాలని వ్యవసాయశాఖ సూత్రపాయంగా నిర్ధారించింది. 

త్వరలో అవగాహన సదస్సులు..

వ్యవసాయ పరికరాలు, యంత్రాలు తయారు చేసే సంస్థల సహకారంతో రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు త్వరలో సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో వ్యవసాయ అనుబంధ రంగాలను సైతం భాగస్వామ్యం చేయనున్నారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు అధికారులు అర్హులైన రైతులను గుర్తించి పరికరాలను ఇవ్వాలని నిర్ణయించారు.

వ్యవసాయరంగం అభివృద్ధి చెందాలంటే కూలీల కొరత ఉన్న ప్రస్తుత తరుణంలో యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయడమే మంచిదని సర్కారు భావిస్తున్నది. త్వరలో ఏర్పాటు చేయనున్న ప్రదదర్శనల్లో రైతులకు ఉపయోగపడే పరికరాలనే ప్రదర్శించా లని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం సైతం ఉంది. ఈ పథకం అమలుతో ఎనలేని మేలు జరుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.