ఎన్నో పోరాటాలు, మరెన్నో వినతుల తరువాత కేంద్రం తెలంగాణలో పసుపు బోర్డును ఎట్టకేలకు ప్రారంభించింది. పసుపు ఉత్పత్తిలో భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు అనేక లక్ష్యాలు, సవాళ్లు కూడా ఉన్నాయి. ఎగుమతుల ప్రోత్సాహకాలు, పరిశోధన సంస్థలు తదితర సంస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
పసుపు బోర్డు ద్వారా రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయాన్ని సమకూరుతుందో, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా తోడ్పాటు అందించాలో కూడా బోర్డు ఏర్పాటుతో పాటే చర్చకు వస్తోంది. తెలంగాణ ప్రాంతం ఎర్రనేలలు అధికంగా ఉన్న ప్రాంతం. వర్షాధార పంటలు అధికంగా పండించడానికి అనువైన ప్రదేశం. 1969లో వచ్చిన హరిత విప్లవం తరు వాత ఇక్కడ పత్తి, వరి పండించడం మొదలైంది.
1969 ముందు తెలంగాణాలో జొన్నలు, రాగులు, మిల్లెట్లు అధికంగా పండించేవారు. సరైన మద్దతు ధర రాకపోవడంతో వరి వైపునకు రైతులు మళ్ల డం జరిగింది. ఆ తదనంతరం తెలంగాణ ప్రాంతంలో భారీగా బోర్లు వేయడం, అధికంగా రైతులు అప్పులు చేయడం లాంటివి ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం వ్యవసాయ రంగంపై కీలక దృష్టి సారించింది.
మారుతున్న జీవన విధానాలు ద్వారా నేడు వర్షాధార పంటలకు మళ్లీ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. పసుపు కూడా వర్షాధారిత పంటల జాబితాలోకే వస్తుంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో పసుపు అధికంగా పండిస్తారు. పండించిన పంటను ఇంతకు ముందు మిగతా రాష్ట్రాలకు తరలించి విక్రయించే వారు. దీని ద్వారా మన రాష్ట్ర రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించకుండా పోయింది.
ఉమ్మడి రాష్ట్రంలో కేవలం పొగాకు బోర్డును గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. పసుపు బోర్డు డిమాండ్ ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదు. 1977లోనే తాత్కాలికంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రాష్ట్రాల నుండి వస్తున్న ఒత్తిడితో ప్రాంతీయ పసుపు బోర్డులకు డిమాండ్ పెరిగింది.
కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రాంతీయ పసుపు బోర్డు కోసం పట్టుపట్టాయి. తాత్కాలికంగా పసుపు బోర్డు కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖలో ఉన్నపటికీ అంతగా లబ్ది చేకూర్చలేదు. స్వయంప్రతిపత్తితో బోర్డును ఏర్పాటు చేసినప్పుడే లాభం చేకూరుతుందని కేంద్రం భావించింది. 2016-17 సమయంలో అప్పటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురా లు కవిత అనేకసార్లు కేంద్ర పెద్దలను కలిసి దీనిపై వినతులను ఇవ్వడం జరిగింది.
2019లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం పలుమార్లు కేంద్రానికి వివరించడం జరిగింది. 2022లో పసుపు బదులు సుగంధ ద్రవ్యాల బోర్డును రాష్ట్రంలో ఏర్పాటు చేస్తునట్టు ప్రకటించిన కేం ద్రం రైతుల నుండి వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయా న్ని వెనక్కి తీసుకుంది. అయితే ఎట్టకేలకు తెలంగాణ భౌగోళికపరిస్థితులు, ఆర్ధిక లాభం తదితర అంశాల దృష్ట్యా కేం ద్రం పసుపు బోర్డును నిజామాబాద్‌లో ప్రారంభించింది.
పసుపు బోర్డు లక్ష్యాలు
తెలంగాణ రాష్ట్రం పరిశ్రమ రంగంలో పురోగమిస్తోంది . దేశ జీడీపీలో మన వాటా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్రం అనువైన ప్రదేశం. 2030 నాటికి పసుపు మార్కెట్ విలువ 1 బిలియన్ డాల్లర్లకు పెంచడమే అతిపెద్ద లక్ష్యం. ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’తో తెలంగాణ రాష్ట్రంలో అనేక కొత్త ఉత్పత్తులు రావడానికి ఆస్కారం ఉంది .
ప్రభుత్వప్రైవేట్ భాగస్వామ్యంలో అనేక పసుపు ఆధారిత పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో దాదాపు 25 రకాల పసుపును పండిస్తారు. వాటిని ఆహార ప్రాసెసింగ్ ద్వారా మిగతా రంగాల్లో ఉపయోగించుకునే అవకాశం ఉంది. డబ్ల్యూహెచ్‌ఓ, ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ సాంప్రదాయ ఔషధాల కేంద్రం ద్వారా పసుపునకు ప్రోత్సాహ కాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి.
ఔషధ గుణాలు అధికంగా ఉన్నందున అనేక ఆహార, ఔషధ రంగాల పరిశ్రమలకు మేధో సంపత్తిగా ఈ బోర్డు పనిచేయబోతోంది. ఉద్యోగ కల్పన, గ్రామీణ సహకార సంఘాలకు పెట్టుబడి సహాయం, గ్రామీణ నిరుద్యోగ నిర్మూలనలాంటివి ఈ బోర్డు ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి లబ్ది చేకూరబోతుంది. ఇవేకాక కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ప్రాంతీయ బోర్డులకు కేంద్రంగా పనిచేయబోతుంది.
పసుపు పంటలను ఇతర జిల్లాల్లో వ్యాప్తి చెందడం, రైతుల కన్సార్టియం ద్వారా అధిక లాభాలను చేకూర్చే విధంగా ఇవి దోహదం చేస్తాయి. భారతదేశం తరువాత ప్రపంచంలో అత్యధిక పసుపు పండించే దేశాలైన చైనా, మయన్మార్, నైజీరియా దేశాలతో మన రాష్ట్రం ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. లాజిస్టిక్స్ హబ్, రవాణా సౌకర్యాలు సైతం మెరుగుపడనున్నాయి.
బోర్డు ఏర్పాటుతోపాటు ఒక పరిశోధన కేంద్రం, ఎగుమతి ప్రోత్సాహక వృద్ధి కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు పసుపుపై మద్దతు ధరను అధికంగా ప్రకటించినప్పుడే వారికి న్యాయం జరుగుతుంది. మన రాష్ట్రంలో అధికంగా పసుపు పండినప్ప టికీ, పసుపు వంగడాలు కర్నాటక, తమిళనాడు రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి.
దీనివల్ల బోర్డు ఇక్కడ ఉన్నప్పటికీ అధిక లాభం పక్క రాష్ట్ర రైతులకు చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఈ సవాళ్లను ఏ విధంగా బోర్డు మన రాష్ట్రాన్ని ఆదుకుంటుందో వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్రం భూపరివేష్టిత రాష్ట్రం కావడం వలన ఎగుమతులకు కొద్దిగా అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా డ్రై పోర్టులను నిజా మాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలి .
ట్రాన్సిట్ కారిడార్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆర్గానిక్ రకమైన పసుపు విత్తనాలను సైతం ప్రోత్సహిం చాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా దేశంతో పాటు మన రాష్ట్ర రైతులకు లబ్ది చేకూరే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జాతీయ పసుపు బోర్డు ముందుకు సాగాలని కోరుకుందాం.
కన్నోజు శ్రీహర్ష