పీక నొక్కేస్తున్నా మీ శ్వాసవుతాం
మీకు ఊపిరాడదని
చేతులు నరికేస్తున్నా కాపు కాస్తాం
మీకు ఆసరా ఉండదని
నిలువునా కూల్చేసినా చిగురిస్తాం
మీకు నీడ ఉండదని
గుర్తించక పోయినా చల్లగా వీస్తుంటాం
మా నైజమది కాబట్టి
కొమ్మలన్నీ కొట్టేస్తునా కొత్త చివుర్లేస్తాం
మీ రేపటి నీడకోసం
కాటికి పంపేస్తున్నా పుట్టుకొస్తుంటాం
కాలుష్యం నుండి కాపాడ్డానికి
గుర్తించక పోయినా అప్రమత్తంగా ఉంటాం
మీ తక్షణ రక్షణకోసం
మా కొన ఊపిరి ఉన్నంత వరకు
మీ చలికి నిప్పవుతాం
మీ ఎండకు వానకు గొడుగవుతాం
మీ మదిలో పక్షుల కిలకిలలవుతాం
మీ ముంగిట పచ్చటి గుబురు కబుర్ల
మధుర భావనలవుతాం!
భీమవరపు పురుషోత్తమ్, 9949800253