- దేశ, విదేశాల్లో కొత్త రికార్డులు
- హైదరాబాద్‌లో రూ.81 వేలు దాటిన తులం ధర
- దేశ రాజధానిలో రూ.82,000 పైకి
- ప్రపంచ మార్కెట్లో 2,790కి ఔన్సు బంగారం
హైదరాబాద్, అక్టోబర్ 30: దీపావళి ముందురోజునే తారా జువ్వకంటే స్పీడుగా బంగారం ధర ఆకాశంలోకి దూసుకెళ్లింది. పండుగ సమయంలో కొనుగోలుదార్లకు తీవ్ర నిరాశ కల్పించింది. రానున్న యూఎస్ అధ్యక్ష ఎన్నికల పట్ల అనిశ్చితితో ప్రపంచ మార్కెట్లలో పసిడి సరికొత్త కొత్త రికార్డులను సృష్టించడంతో బుధవారం హైదరా బాద్ బులియన్ మార్కెట్లో పుత్తడి తొలిసారిగా రూ. 81,000 స్థాయిని అధిగ మించింది.
24 క్యారెట్ల తులం బంగారం ధర మరో రూ. 710 పెరిగి రూ.81,160 వద్దకు చేరింది. దేశరాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో నైతే ఇది చరిత్రలో మొదటిసారిగా రూ. 82,000 స్థాయిని దాటింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్స్ ధర మరో 10డాలర్ల ఎగిసి 2,790 డాలర్ల వద్ద నూతన రికార్డును నెలకొల్పింది.
ఈ ప్రభావంతో దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం బుధవారం రాత్రి రూ. 79,500 వద్దకు చేరింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా పుంజుకున్నది. ఈ విలువైన లోహం కేజీ ధర హైదరాబాద్ మార్కెట్లో తాజాగా రూ. 2,100 పెరిగి రూ. 1,09,000 వద్దకు చేరింది. అయితే కొద్ది రోజుల క్రితం నెలకొల్పిన రూ. 1.12 లక్షల రికార్డుస్థాయిని వెండి ఇంకా అందుకోలేదు.
యూఎస్ ఎన్నికల అనిశ్చితి, దీపావళి డిమాండ్ కారణం
నవంబర్ 4న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పట్ల అనిశ్చితితో సురక్షిత సాధనంగా పరిగణించే బంగారంలోకి ఇన్వెస్టర్లు వారి పెట్టుబడుల్ని మళ్లిస్తున్నందున అంతర్జాతీయంగా ధర కొత్త రికార్డుస్థాయికి పెరిగిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు.
దీనికి తోడు దేశీయంగా దీపావళి డిమాండ్‌ను తట్టుకునేందుకు జ్యువెలర్లు బంగా రాన్ని భారీగా కొనుగోలు చేయడంతో స్థానిక మార్కెట్లలో ధర పుంజుకున్నదని వివరించారు. యూఎస్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, కేంద్ర బ్యాంక్‌లు వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి పరుగు తీస్తున్నదని మోతీలాల్ ఓస్వాల్ కమోడిటీ అనలిస్ట్ మానవ్ మోది చెప్పారు.