calender_icon.png 25 December, 2024 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు గ్రీన్ చానల్

25-12-2024 02:16:42 AM

  1. కొత్త ఏడాదిలో ఇండ్ల నిర్మాణం 
  2. వెంటవెంటనే నిధులు మంజూరు 
  3. 33 జిల్లాలకు ప్రాజెక్ట్ డైరెక్టర్ల నియామకం 
  4. అవినీతికి ఆస్కారం లేకుండా గృహాల నిర్మాణం 
  5. ఇందిరమ్మ యాప్ ద్వారా ఇప్పటికే 32 లక్షల దరఖాస్తుల పరిశీలన
  6. గత ప్రభుత్వం వదిలేసిన వాటినీ పూర్తిచేస్తాం 
  7. మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి

* బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో డబుల్‌బెడ్ రూం ఇళ్ల పథకం కింద  మంజూరై.. సొంత డబ్బులతో ఇంటిని  నిర్మించుకున్న పేదలుంటే, వారికి కూడా ఇందిరమ్మ పథకం కింద రూ. 5 లక్ష లు అందజేస్తామని చెప్పారు. వా రు పింక్ కలర్ షర్ట్ వేసుకున్నా సరే, అత్యంత పేదలైతే.. వారికి ఈ  పథకం వర్తిస్తుందన్నారు.  గతంలో అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన డబుల్‌బెడ్ రూం ఇళ్లను పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. 

 మంత్రి  పొంగులేటి 

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): దేశంలో ఏ రాష్ర్టంలో లేని విధంగా తెలంగాణలో వచ్చే నాలుగు సంవత్సరాలలో  20 లక్షల ఇండ్లను నిర్మిస్తామని, గ్రీన్ చానల్ ద్వారా నాలుగు విడతల్లో ఇండ్ల నిర్మాణానికి నిధులు విడుదలచేసి త్వరితగతిన పూర్తిచేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో అత్యంత నిరుపేదలకే తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు.  ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మంగళవారం హిమాయత్‌నగర్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం మంత్రి మీడియా తో మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకుగాను రాష్ర్టంలోని 33 జిల్లాలకు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయి కలిగిన ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించామన్నారు.  ఏటా 4.50 లక్షల ఇండ్ల చొప్పున  వచ్చే  నాలుగేళ్లలో   20 లక్షల ఇండ్లకు  తక్కువకాకుం డా ఇండ్లు నిర్మిస్తామన్నారు.

తొలి ప్రాధాన్యతలో సొంత స్థలం కలిగిన వికలాంగులు, వితంతువులు, పారిశుద్ధ్య కార్మికుల ను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వాటిలో ఈనెల 23వ తేదీ నాటికి సుమా రు 32 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందన్నారు.   

రోజుకు నాలుగున్నర నుంచి ఐదున్నర లక్షల దరఖాస్తులను పరిశీలన జరుగుతుందని, జనవరి మొదటి వారంలో మిగతా దరఖాస్తులు కూడా పూర్తవుతాయని మంత్రి చెప్పారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి సంక్రాంతినాటికి ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల పథకం కింద మంజూరై.. సొంత డబ్బులతో ఇంటిని  నిర్మించుకున్న పేదలుంటే, వారికి కూడా ఇందిరమ్మ పథకం కింద రూ. 5 లక్షలు అందజేస్తామని చెప్పారు. వారు పింక్ కలర్ షర్ట్ వేసుకున్నా సరే, అత్యంత పేదలైతే.. వారికి ఈ  పథకం వర్తిస్తుందన్నారు.

ఈ జాబితాకు చెందినవారిలో దాదాపు 600 నుంచి 700 వరకు లబ్ధిదారులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన డబుల్‌బెడ్ రూం ఇళ్లను పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. హౌసింగ్ బోర్డు కింద ఉన్న స్థలాలు అన్యాక్రాంతం కాకుండా  ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.  

95 శాతం ఉద్యోగులను వెనక్కి తీసుకున్నాం.. 

హౌసింగ్ కార్పొరేషన్ బలోపేతం చేస్తున్నామని, గత ప్రభుత్వం ఈ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి చెప్పారు. వివిధ విభాగాలలో పనిచేస్తున్న  95శాతం కార్పొరేషన్ ఉద్యోగులను వెనక్కి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ ఏడాది నాలుగన్నర లక్షల ఇండ్ల నిర్మాణమే కాకుండా, 20 లక్షల ఇండ్లు నిర్మించడానికి అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చు కుంటున్నామని తెలిపారు.

‘ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ. చిన్నచిన్న తప్పులు కూడా జరగకుండా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.   కేంద్ర ప్రభుత్వం తన  నిబంధనల మేరకు కొంతమందిని తిరస్కరించినా, రాష్ర్ట ప్రభుత్వం తరపున వారికి ఇండ్లు ఇస్తాం. కేంద్రం విధించే నిబంధనలను ఆమోదిస్తూ కేంద్రం  నిధులను తీసుకుంటాం.

ఈ విషయంలో మేం ఎటువంటి బేషజాలకు పోయేదిలేదు. రాష్ర్ట ఆర్ధిక పరిస్ధతి బాగులేకున్నా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో తగ్గేదిలేదు. తలతాకట్టుపెట్టయినా ఇండ్లు నిర్మిస్తాం. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పేషి మొదలు కొని నా పేషీ, ముఖ్య అధికారుల కార్యాలయాలలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేస్తాం’ అని మంత్రి తెలిపారు. 

రేషన్ కార్డుతో సంబంధం లేదు.. 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికిగాను ప్రత్యేక విధివిధానాలు ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. వారంరోజులు లోగా ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ‘ప్రత్యేక వెబ్‌సైట్, టోల్ ఫ్రీ నెంబర్లు ఇస్తాం. రాష్ర్టంలోని ఏ మా రుమూల తండా, లేదా గ్రామం నుంచైనా ఫిర్యాదు చేస్తే తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటాం.

ఫిర్యాదుదారునికి తిరిగి వివరాలు అందిస్తాం. ఇప్పటికే గ్రామాలవారీగా రెవెన్యూ అధికారులను నియ మించాలని నిర్ణయించాం. త్వరలో 1200 వరకు సర్వేయర్లను నియమిస్తాం. రేషన్‌కార్డులతో సం బంధం లేకుండా సొంత స్ధలం ఉన్నవారికి తొలుత ప్రాధాన్యత ఇస్తాం. గ్రామాల వారీగా ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపికచేస్తాయి. ఈ నేపధ్యంలో ఏ అధికారి తప్పుచేసినా గట్టిచర్యలు తీసు కుంటాం.

గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇండ్లను కూడా నిర్మిస్తాం. హైదరాబాద్ నలువైపులా వందేసి ఎకరాలను సమీకరించి హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో  ఇండ్ల నిర్మాణం చేపడతాం’ అని మంత్రి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి బుద్ధ ప్రకాష్, ఎండీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.