calender_icon.png 20 January, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవీయ విలువలతోనే మహదానందం

04-10-2024 12:00:00 AM

కాలం కలిసొస్తే అంతా గొప్పవాళ్ళుగానే చెలామణీ అవుతారు. డబ్బు సంపాదిస్తే గుణం లేకపోయినా గొప్పవాళ్ళ మనే అహంకారం ప్రదర్శిస్తారు. నిజమైన వ్యక్తిత్వమున్న వారంతా ఏ స్థితిలో ఉన్నా ఎప్పుడూ ఒకే విధంగా ప్రవర్తిస్తారు. గుణ సంపన్నులు అవకాశవాదానికి అతీతులు. వర్తమాన సమాజంలో అరుదుగా కనిపించే ఇలాంటి  వారే సమాజంలో గౌరవానికి నిజమైన అర్హులు.

పరులను హీనంగా చూసే వ్యక్తులు,గుణహీనులు ధనమున్నా దరిద్రులతో సమానమే.డబ్బు జబ్బు సోకిన మెదలో ఆర్థిక అంటరానితనమనే మానసిక రోగాలు సోకి సాటి మనుషులను కనీస విచక్షణ లేకుండా అత్యంత అవమానకరమైన రీతిలో వెలివేసే సంస్కృతి మొదలైనది. ఇలాంటి మానసిక రోగులకు డబ్బున్న వారే తప్ప  ఇతరులు కనిపించరు.

ఇలాంటి తీవ్రమైన మానసిక ఉన్మాదం గల వారంతా తమ చేష్టలతో, ఇతరులను అవమానించి ఆనందిస్తున్నా మనే భ్రమలో కాలం గడుపుతున్నారే తప్ప భవిష్యత్తులో ఇలాంటి వారు తీవ్రమైన మానసిక రుగ్మతలపాలై, శాశ్వత దుఃఖానికి కేరాఫ్ అడ్రస్‌గా మారతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అరమరికలు లేని ఆత్మీయతలతో, మానవీయ విలువలతో, సాటి  మనిషిని మనిషిగా గౌరవించే సద్గుణాలతో జీవించడం వలన నిజమైన ఆనందం వెల్లివిరుస్తుంది.నిజాయితీ, నీతి, న్యాయం వంటి గుణాలతో వ్యక్తిత్వానికి  నిండుదనం చేకూరుతుంది. నమ్మక ద్రోహం, కృత ఘ్నత, వంచన, అహంకారం వంటి లక్షణాలు జీవితంలో ఏదో ఒక రోజు అథఃపాతాళానికి గెంటడం ఖాయం.

సంతృప్తికరమైన జీవితం వలన మానసిక ఉత్సాహం ఉచ్ఛస్థితికి చేరుతుంది.దాని వలన ఎంతో ప్రశాంతత సమ కూరుతుంది. అలాంటి మానసికమైన అనుభూతి ఎందరికి దక్కుతుంది? ఎన్నో జీవితాలు మానసిక ప్రశాంతత కరువై అల్లకల్లోల సాగరాన్ని తలపిస్తున్నాయి.జీవితంలో ఎదురయ్యే ఆర్థిక బాధలతో కొంతమంది,ఆప్యాయతలు కరువై మరికొంత మంది, నమ్మక ద్రోహం వలన కొందరు, భగ్నప్రేమికులై ఇంకొందరు ఆనందం కోల్పోయి జీవితాన్ని నిరాశానిస్పృహల మధ్య నెట్టుకొస్తున్నారు.ఆనందం లేని జీవితాలు జీవచ్ఛవాల వంటివి. మనశ్శాంతి కరువైన బ్రతు కులు మరణ సదృశాలు.

ధనార్జనకే జీవితమన్నట్టు బ్రతికేస్తే ఆ జీవితానికి అర్థం నిఘంటువుల్లో భూతద్దంతో వెదకినా దొరకదు. ఆశలను అదుపులో పెట్టుకుని,మానవజాతి మనుగడ పది కాలాలు వర్ధిల్లే విధంగా నైతిక ప్రవర్తనను తీర్చిదిద్దుకోవాలి.  నిజమైన ఆనందం నిండైన వ్యక్తిత్వంలో ఇమిడి ఉంది. ఆనందం అంటే అంగట్లో అమ్ముడు పోయే వస్తువుకాదు.అలవికాని కోరికలతో అలమటించడం మాని,అంతః కరణ శుద్ధితో మానవ మస్తిష్కాల్లో నిండిన బురదను కడిగేసుకుని, అందరూ మెచ్చే  వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి. 

నిండైన గుణాలు మెండుగా ఉంటే వ్యక్తిత్వం వికసిస్తుంది. సమాజం గౌరవిస్తుంది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం వల్లనే వ్యక్తిత్వానికి వన్నె చేకూరుతుంది.గాలికి వంగే చెట్టు తుపానును  సైతం తట్టుకుని నిలబడుతుంది. మనిషి కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమే నిజమైన సంస్కారగుణం.

క్షీణించింది. మనిషి విజ్ఞాని, మానసికంగా అజ్ఞాని.సంస్కారం లోపించింది- సహనం నశించింది. వివేకానికి, సంస్కార గుణానికి విలువ పెరిగితే ప్రపంచమే ఒక ఆనంద నిలయమౌతుంది. ఈ విషయాన్ని విద్యార్థులకు బోధించాలి. డబ్బులోనే సర్వ సుఖాలు సమకూరుతా యని యువత భావించడం పొరపాటు.

మంచితనం, సేవాదృక్ఫథం మానసిక ప్రశాంతతకు మూలకారణం. నిజమైన ఆనందం వ్యక్తిత్వ వికాసం వలన,స్వార్థ చింతన లేని గుణం వలన సమకూరుతుంది. అలాంటి వ్యక్తులను ఈ సమాజం గౌరవించినప్పుడే మిగిలిన వారు కూడా మంచి బాటలో పయనించగలరు.

వ్యక్తులు ఉన్నత భావాలు కలిగి ఉంటే సమాజం నిజమైన ఆనందానికి నిలయంగా మారుతుంది. అవధులు లేని ఆనందం ధన సంపద వలన కాదు- గుణసంపద వలనే సిద్ధిస్తుంది. ఆనందమయమైన జీవితం ఒక వరం. ఆనందానికి కరువైన జీవితాల్లో ఎంత ధనమున్నా  ప్రయోజనం శూన్యం. మనిషి ఎంత 

ఎత్తుకు ఎదిగినా తన ఎదుగుదలకు కారణమైన వారిని తృణీకరించి తూలనాడడం మానసిక ఉన్మాదం.

 సుంకవల్లి సత్తిరాజు