calender_icon.png 5 February, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా ఘనపాటి

21-01-2025 12:00:00 AM

మాడపాటి హనుమంతరావు  ఉత్తమ రచయిత. కవి. మొదట్లో కవిత్వం వ్రాసేవా రు. ఆంధ్రోద్యమంలో నిమగ్నులైన తరువాత వీరికి పద్యాలు రచించే అవకాశమే లేకపోయింది. అంతేకాక, ఆధునిక కాలపు అవసరాల దృష్ట్యా వచనరచనకే తమ లేఖినిని ఉపయోగించవలసి వచ్చిం ది. పంతులు తొలుత రచించిన గ్రంథం బెంగాలీ నవలా రచయిత బంకించంద్ చటర్జీ వ్రాసిన సుప్రసిద్ధ నవల ‘ఆనంద మఠము’నకు తెలుగు అనువాదం.

‘క్షాత్రకాలపు హింద్వార్యులు’ అనేది పంతులు మరొక గ్రంథం. బొంబాయి వాస్తవ్యులూ, పంతులు మిత్రులూ అయిన రావు బహదూర్ చింతామణిరావు వైద్య రచించిన ‘ఎపిక్ ఇండియా’ అనే ఆంగ్లగ్రంథంలోని వ్యాసములకు ఇది ఆంధ్రానువాదం.

దీనిని పువ్వాడ వెంకటప్పయ్య వారి కృషి ‘ప్రచారిణీ’ గ్రంథమాలలో రెండవ కుసుమముగా 1927లో ప్రచురించారు. ఆర్యుల దుస్తులు, వారి ఆహారం, వివాహ పద్ధతి, రాజ్యాంగ విధానం మొదలైన విషయాలు ఈ గ్రంథంలో పరిశోధనా పూర్వకంగా చర్చించడం జరిగింది. ఆర్యుల సంస్కృతిని, సంప్రదాయాలను తెలుసుకొనడానికి ఈ గ్రంథం ఉపకరిస్తుంది.

తెటుగులోకి ‘మహాభారత సమీక్ష’

వైద్య ఆంగ్లంలో రచించిన ‘మహాభారత సమీక్ష’ అనే గ్రంథాన్ని కూడా హనుమంతరావు 1916లో తెనిగించారు. దీనిలో నుంచి కొన్ని అధ్యాయాలు ‘ఆంధ్రభారతి’, ‘దేశబంధు’ మున్నగు పత్రికలలో ప్రకటితమయ్యాయి. ఫారసీ కవులను గురించి పంతులు వ్రాసిన వ్యాసాలు ‘సుజాత’ పత్రికలో ప్రకటితమైనవి. పంతులు వ్యాసాలన్నీ ఒక సంపుటిగా వెలువడవలసి ఉన్నది.

తెలుగులో ఆధునిక రీతిలో కథానికను రచించిన ఖ్యాతి హనుమంతరావుదా లేక ఆ గౌరవం గురజాడ అప్పారావుకి దక్కుతుందా అనే విషయంలో అభిప్రాయ భేదానికి తావున్నట్లు కన్పిస్తున్నది. “1910 ప్రాంతాలలోనే హనుమంతరావు కథలు ‘కృష్ణాపత్రిక’లో ప్రకటితమయ్యాయని” చెబుతారు. “ఆదిరాజు వీరభద్రరావు కథానికలనూ నూతన రీతిలో వ్రాసిన కీర్తి హనుమంతరావుకే చెందవలసి ఉన్నదని చెప్పుటకు మిగుల సంతోషిస్తున్నాము” అని వ్రాశారు.

పంతులు మొత్తం 18 కథలు రచించారు. వాటిలో నుంచి 1. హృదయ శల్యము 2. రాణీసారంధా, 3. ముసలిదాని యుసురు, 4. నేనే, - 5. అగ్ని గుం డము, 6. నాడు నీ పంతము నేడు నా పంత ము, 7. ఆత్మార్పణ ము.. అనే కథలు ‘మల్లికా గుచ్ఛము’ పేరుతో 1911లో పుస్తకరూపంగా వచ్చాయి. ప్రకటించిన వారు ‘సరస్వతీ నికేతనము’, మచిలీపట్టణం.

వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారు ప్రకటించిన ‘కవిత్వవేది’కి చెందిన ‘ఆంధ్ర వాఙ్మయ --చరిత్ర సంగ్రహము’లో హనుమంతరావు ‘మల్లికా గుచ్ఛ మొప్పుల కుప్ప’ అని ప్రశంసించి ఉన్నారు. అయితే, వీరి ఇంటిపేరును పొరపాటున ‘మైనంపాటి’ అని వ్రాశారు. మాడపాటి అని ఉండవలెను. ‘విధి ప్రేరణము’, ’ఎవరికి?’ అనే కథలను హైదరాబాదులోని ‘అణా’ గ్రంథమాల వారు 1940లో తమ 12వ కుసుమంగా ‘మాలతీ గుచ్ఛము’ పేరుతో ప్రకటించారు.

ప్రేమ్‌చంద్ ఉర్దూకథలకు తొలి తెలుగుసేత

‘న్యాయమా ?’, ‘ఎవరిది తప్పు?’, ‘ఇక కావలసినదేమి?’, ‘నిజమేనా’ అనే కథలు ‘సుజాత’, ‘భారతి’, ‘శారద’ మాసపత్రికలలో అచ్చు అయినవి.

ఈ కథలలో ‘హృదయ శల్యము’, ‘నేనే’ అను రెండు కథలు మాత్రమే హనుమంతరావు పంతులు సొంత రచనలు. తక్కినవి ప్రఖ్యాత ఉర్దూ కథా రచయిత మున్షీ ప్రేమ్‌చంద్ కథలకు అనువాదములు, అనుసరణలు. అయితే, ప్రేమచంద్ ఉర్దూకథలను మొట్టమొదట తెనిగించి ఆంధ్రులకు పరిచయం చేసిన గౌరవం మాడపాటి హనుమంతరావు పంతులుకే దక్కుతుంది. వీరి అనువాదాలు చదివిన పిమ్మట తెలుగులో ఎందరో రచయితలు ఆ పద్ధతిలో కథా రచన చేశారు.

‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ హైదరాబాదు వారు 1984లో హనుమంతరావు పంతులు శత జ యంతి కానుకగా ‘మల్లికా గుచ్ఛము’ కథా సంకలనాన్ని తిరిగి ప్రచురించారు. ఇందులో మొదటి ముద్రణలోని ఏడు కథలతోపాటు ‘ఎవరిది తప్పు?’ అనే కథనూ, అణా గ్రంథమాల వారు ‘మాలతీ గుచ్ఛము’ అనే పేరుతో ప్రకటించిన ‘ఎవరికి ?’, ‘విధి ప్రేరణ’ అనే కథలను కూడా చేర్చి, మొదటి ముద్రణకు పంతులు వ్రాసిన పీఠికతోసహా ప్రచురించారు. ఈ కథాసంపుటి ప్రకటన ప్రశంసనీయమైన కార్యం. ఈ తరం వారికి వెనుకటి కథలను చదివే అవకాశం కలుగుతుంది. 

రుద్రమదేవి కాలం నాటి కథ 

పంతులు సొంతంగా రచించిన కథలలో ‘హృదయ శల్యము’ చారిత్రక కథ. కాకతీయ సామ్రాజ్య ధురీణ రుద్రమదేవి కాలం నాటి కథ ఇది. ఇందులో రుద్రమదేవి ఒక పాత్రకూడా. ప్రతాపుడు, అతని భార్య యమున ఓరుగల్లు- అంబాలకు నడుమ ఆరణ్య ప్రదేశం గుండా వెళ్ళుతూ ఉంటే దోపిడీ దొంగలు వచ్చి ఆ యువతిని చంపబోతూన్న సమయంలో పురుషవేషంలో ఉన్న రుద్రమదేవి అక్కడికి వచ్చి తన పట్టా కత్తితో దోపిడిగాండ్ర నాయకుని చేతిని నరికివేసి, ఆ యువతిని ఆర్ద్ర హృదయంతో కౌగలించుకొంటుంది.

ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. అది జరిగిన తర్వాత ప్రతాపుడు తన భార్యను అనుమానించి ఆమెపట్ల విముఖుడై ఉంటాడు. ఆ కౌగలించుకొన్న పురుషునికి ఆమె హృదయం అర్పించి ఉంటుందని అతని అనుమానం.- ఇది ఇట్లా ఉండగా రుద్రమదేవి పురుషవేషంలో వచ్చి వారింట రెండు రోజులు అతిథిగా ఉంటుంది.

ఆ అతిథి యమునకు ఇష్టం లేని అతిథిగా పరిణమించడంతో, అతిథియైన అతనిని పరుషవాక్కులతో ఆమె అగౌరవ పరుస్తుంది. కాని, ఆమె స్త్రీ అని తెలిసిపోయి ఆ దంపతులు ఉభయులూ ఆమె పాదాలపై పడి తమ అపరాధాన్ని మన్నింపమని వేడుకొంటారు. 

‘నేనే’ అనేది సాంఘిక కథ. ఈ రెండు కథలలోనూ మారువేషం ఉభయ సామాన్యం. ఇది కథలో ఉత్కంఠను ప్రవేశపెట్టడానికై అనుసరించిన పద్ధతి. ఆ కాలంలో ఇటువంటి నాటకీయ సన్నివేశాలుగల కథలను స్త్రీ పురుషులు ఆసక్తితో చదివేవారు. పంతులు ఈ రెండు స్వతంత్ర కథలూ పాఠకులను కుతూహలంతో చదివించేవిగా ఉన్నవి. వీటిభాష సరళ గ్రాంధికము.

‘తెలంగాణా ఆంధ్రోద్యమము’ 

‘నిజాం రాష్ట్రములో రాజ్యాంగ సంస్కరణలు’ అనేది పంతులు రచించిన మరొక పుస్తకం. అయితే హనుమంతరావుకి రచయితగా చిరయశస్సు నార్జించి పెట్టిన గ్రంథం ‘తెలంగాణా ఆంధ్రోద్యమము’ అనే రెండు భాగములుగా ఉన్న నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమ చరిత్ర.

ఆధునిక యుగంలో ఆంధ్రజాతి వికాసాన్ని గురించి వ్రాయదలచిన చరిత్రకారులెవ్వరూ ఈ గ్రంథాన్ని ప్రస్తావించకుండా ఉండలేరు. నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణా ఆంధ్రులు సల్పిన పోరాటాన్ని ఈ చరిత్ర విశదీకరిస్తు న్నది. 1985 జనవరి 22న జన్మించిన మాడపాటి 1929 నవంబర్ 11న కన్నుమూశారు.

హనుమంతరావు పంతులు చక్కని ఉర్దూ రచయిత. వీరు చాలా ఏళ్ళు హైదరాబాదు నుంచి వెలువడ్డ ‘ముషీరెదక్కన్’ అనే ఉర్దు దినపత్రికకు సంపాదకీయాలు వ్రాశారు. ఇది మితవాద పత్రిక. కానీ, ఇందులో వెలువడే వార్తలు వ్యాఖ్యలు యదార్థాలై ఉండి పత్రికకెంతో గౌరవ మర్యాదలు తెస్తూ ఉండేవి. పంతులు సంపాదకీయాలు ఘాటుగా లేకపోయినా ప్రభుత్వ విధానంపై చేయవలసిన విమర్శను చక్కగా ప్రతిబింబించి ఉండేవి.

ప్రచురణ కాలం: 1985, ‘ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు’ జీవితచరిత్ర నుంచి..