28-08-2024 12:42:50 AM
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 27 (విజయక్రాంతి): మహిమాన్వితమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని, దేశంలోనే ప్రముఖ క్షేత్రంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. మంగళవారం ఆయన యాదాద్రి ఆలయానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ హనుమంతు కే జండగే, ఆలయ ఈవో ఏ భాస్కర్‌రావు ఘన స్వాగతం పలికారు.
తొలుత కొండపై విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం జరిపి, అఖంఢ దీపారధన చేశారు. మహాద్వారం వద్ద మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చరణలతో ఆలయ మర్యాదల ప్రకారం అర్చకులు పరివట్టం, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ముఖ మండపంలో ధ్వజ స్తంభానికి మొక్కి, గర్భాలయంలో స్వామివారికి స్వర్ణపుష్పార్చన, అష్టోత్తర పూజలు జరిపారు. అనంతరం వేదపండితులు చతుర్వేద పారాయణాలు జరిపి మహాదాశీర్వచనం చేశారు. ఆలయ నిర్వహణ తీరు పట్ల అధికారులను గవర్నర్ ప్రశంసించారు. మరోసారి ఆలయాన్ని సందర్శిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం, డీసీపీ రాజేశ్ చంద్ర, ఆలయ అనువంశిఖ ధర్మకర్త బీ నర్సింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.