తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ఎంగిలి పూలతో ప్రారంభమై గురువారం తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సద్దుల బతుకమ్మ పండుగను ఆడబిడ్డలు ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ అంటూ పాడిన పాటలతో ఊళ్లన్నీ మారుమ్రోగాయి.
మరోవైపు రాష్ట్ర రాజధానిలో హుస్సేన్ సాగర్ తీరాన సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ట్యాంక్‌బండ్ పూలబండ్‌గా మారింది. లేజర్ షో, క్రాకర్స్ షోతో ట్యాంక్‌బండ్ పరిసరాలన్నీ రంగురంగుల కాంతులీనాయి. బతుకమ్మలను నిమజ్జనం చేసి మళ్లీరా బతుకమ్మ.. వెళ్లిరా బతుకమ్మ అంటూ గౌరమ్మను మహిళలు సాగనంపారు.
పూల సింగిడి.. సద్దుల సందడి
- అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
- ఆడిపాడిన ఆడపడుచులు
- ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. ఎంగిలి పూలతో ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు గురువారం తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా బతుకమ్మ సంబురాల్లో ఆడిపాడారు.
నగరంలో పాటు జిల్లాలో సద్దుల సందడి కనిపించింది. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ అంటూ ఆడబిడ్డలు ఆడిపాడారు. హుస్సేన్ సాగర్ తీరాన సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ట్యాంక్‌బండ్ పూలబండ్‌గా మారింది. ట్యాంక్‌బండ్ పరిసరాలన్నీ జిగేల్‌మనే కాంతులతో విరజిమ్మా యి.
డప్పు కళాకారులు, బంజారా, ఆదివాసీ, గిరిజన కళాకారుల సంప్రదాయ నృత్యాలు, కోలాట బృందాల విన్యాసాల నడుమ సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనం గా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
సచివాలయం సమీపంలోని అమరవీరుల స్మారక స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ మీదు గా చిల్డ్రన్స్ పార్క్ దాకా బతుకమ్మలతో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 40 నిమిషాల పాటు లేజర్ షో నిర్వహించడంతో పాటు క్రాకర్స్ పేల్చడంతో ట్యాంక్‌బండ్ పరిసరాలన్నీ రంగురంగుల కాంతులతో మెరిసిపో యాయి.
హుస్సేన్ సాగర్‌లో ఓ బోటుపై విద్యుత్ కాంతులతో వెలుగుతూ ప్రదర్శించిన బతుకమ్మ ప్రతిమలు ఆకట్టుకున్నాయి. అనంతరం ట్యాంక్‌బండ్ చిల్డ్రన్స్ పార్కు వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేసి మళ్లీరా బతుకమ్మ.. వెళ్లిరా బతుకమ్మ అంటూ మహిళలు గౌరమ్మను సాగనంపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, ఎమ్మెల్సీ కోదండరాం, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, పర్యాటక శాఖ డైరెక్టర్ ఇలా త్రిపాఠి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.
పోయిరా బతుకమ్మ ఉయ్యాలో !
జిల్లాల్లో సందడిగా సద్దుల బతుకమ్మ
సద్దుల బతుకమ్మ వేళ పుడమి పూల సింగిడై మెరిసింది.. బంగారు గౌరమ్మ అతివలను ఆశీర్వదించింది. మది నిండా భక్తిని నెలకొల్పింది. కొలిచిన హృదయాలను పరవశింపజేసింది. ‘హిమవంతునింట్ల పుట్టి ఉయ్యాలో.. హిమవంతునింట్ల పెరిగి ఉయ్యాలో.. విదియ పోయి తదియ నాడు ఉయ్యాలో.. కాంతలంతా కూడి ఉయ్యాలో.. గన్నేరు కొమ్మ తెచ్చి ఉయ్యాలో.. గౌరమ్మ పూజలు చేసి ఉయ్యాలో..’ అంటూ మహిళల బతుకమ్మ ఆటాపాట.. డప్పు చప్పుళ్ల మోత.. పిల్లాపాపలు కేరింతలతో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలు దద్దరల్లియ్యాయి. విజయక్రాంతి నెట్‌వర్క్, అక్టోబర్ 10