calender_icon.png 18 January, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమండలిలో మహా మాయగాళ్లు!

06-09-2024 12:00:00 AM

  • అవలీలగా రూల్స్ మార్చే ఉల్లం‘ఘనులు’ 
  • చేయి తడిపితే చాలు.. సర్వీస్ బుక్‌నే మర్చేస్తారు!
  • ఉద్యోగుల వయస్సును తగ్గించి.. రిటైర్‌మెంట్ వయస్సును పెంచేస్తారు

చార్మినార్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): బాలాపుర్ జలమం డలి పరిపాలన అధికారు లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల సర్వీస్ బుక్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులు ఉద్యోగుల సర్వీస్‌ను తగ్గించి.. రిటైర్‌మెంట్ వయస్సును పెంచుతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అడిగినంత లంచం ఇస్తే చాలు. సర్వీసు బుక్‌నే మర్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  ఇటీవల రియాసత్‌నగర్ డివిజన్‌లో ఓ ఉద్యోగి నిర్వాకం వెలుగులోకి రావడంతో ఈ బాగోతమంతా బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్‌మెంట్ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 ఏండ్లకు పెంచడం చర్చనీయాంశమైంది.

వెలుగులోకి ఒక ఉద్యోగి చిట్టా..

బాలాపూర్‌కు చెందిన ఏ బాబు అనే వ్యక్తి 1989లో సాధారణ కూలీగా జలమండలిలో చేరాడు. అప్పట్లో కార్డు నెంబర్ 1048, సెక్షన్ జహనుమా వార్డు నంబర్ 18లో ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. విద్యార్హత సర్టిఫికెట్లలో ఆయన 1970లో జన్మించినట్లు ఉంది. దీని ఆధారంగా జలమండలి హెచ్‌ఆర్ విభాగంలోనూ అలాగే నమోదైంది. పదేళ్ల క్రితం బాబు కొలువు పర్మినెంట్ అయింది. 1970లో పుట్టిన బాబు వయస్సు ప్రస్తుత వయస్సు 54 ఏళ్లు ఉండాలి.  కానీ తన వయస్సును నాలుగేళ్లు తగ్గించుకునేందుకు పథకం పన్నాడు. తన వద్ద ఉన్న పాన్‌కార్డు, ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పించుకున్నాడు. వాటిలో 1974లో పుట్టినట్లు మార్పులు చేయించుకున్నాడు. వాస్తవానికి బాబు 2030లో రిటైర్‌మెంట్ కావాల్సి ఉంది. కానీ రికార్డుల్లో వయస్సు తగ్గించడంతో ఆయన రిటైర్‌మెంట్ 2034కు వెళ్లింది.

సర్వీస్ బుక్‌నే మార్చిన ఘనులు

బాలాపూర్ సబ్ డివిజన్ జలమండలి పరిధిలోని రియాసత్‌నగర్ డివిజన్‌లో సీనియర్ గ్రేడ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ అధికారి సూత్రధారి అని.. ఆయనతో పాటు ఓ సీనియర్ ఆఫీసర్, మరో కిందిస్థాయి ఉద్యోగి ఈ వ్యవహారం నడిపించినట్లు తెలిసింది. అందుకు బాబు నుంచి రూ.లక్ష వరకు లంచం తీసుకున్నారని సమాచారం. ఈ క్రమంలో ఇంకా ఎంతమంది రికార్డుల్లో వయస్సు మారింది? ఎంతమంది సర్వీసు పెరిగింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలతో పాటు జలమండలి ఉన్నతాధికారులు స్పందించి ఈ బండారాన్నిబట్టబయలు చేయాలని ఉద్యోగులు, సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.