- ఆయన తెలంగాణ సాగునీటి రంగ పితామహుడు
- ఇంజినీర్స్ డేలో కోమటిరెడ్డి
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను భారతదేశపు మొదటి ఇంజినీర్‌గా గౌరవించుకుంటామని, ఆ తర్వాత గర్వంగా చెప్పుకోదగ్గ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహుదూర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. 11వ తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకల్లో భాగంగా గురువారం ఖైరతాబాద్ ఇంజినీర్స్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
హైదరాబాదు నగరాన్ని వరదల నుండి రక్షించినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు మరువలేనివన్నారు. మనం నిజాంసాగర్ ప్రాజెక్టు గురించి ఇవ్వాళ గొప్పగా మాట్లాడుకుంటున్నామంటే అది విశ్వేశ్వరయ్య, నవాజ్‌జంగ్ కృషేనని అన్నారు. అంతంతమాత్రం టెక్నాలజీ ఉన్న ఆ రోజుల్లోనే 58 టీఎంసీల సామర్ధ్యం కలిగిన నిజాంసాగర్ ప్రాజెక్టును పకడ్బందీగా నిర్మించారని, అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందన్నారు. కానీ, రెండు మూడేండ్ల కింద కట్టిన సాగునీటి ప్రాజెక్టులు నెర్రెలుబారుతున్న సంఘటనలు మనం పేపర్లలో, టీవీల్లో చూస్తున్నామని, దీనిపట్ల ఇంజినీర్లు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని పరోక్షంగా బీఆర్‌ఎస్ పార్టీని మంత్రి విమర్శించారు. ఉమ్మడి రాష్ర్టంలో అభివృద్ధి, అస్థిత్వంలో అన్యాయం జరిగినట్టే మహానుభావుల గుర్తింపులోనూ అన్యాయం జరిగిందని, అందుకు ఉదాహరణే నవాజ్‌జంగ్ అన్నారు.
తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత నవాజ్‌జంగ్ జయంతి రోజున ఇంజినీర్స్ డేగా అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ఆయన మొట్టమొదటి స్వదేశీ చీఫ్ ఇంజనీర్‌గా రికార్డు సృష్టించారని వెల్లడించారు. తమది అకౌంట్స్ చూసే ప్రభుత్వం కాదని అకౌంటబిలిటీ ఉన్న ప్రభుత్వమని చెప్పారు. ఉద్యోగుల సమస్యలను తీర్చడానికి ఎప్పుడూ ముందుంటామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంలో రిటైర్డ్ ఇంజినీర్ల సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. తమది టీం వర్క్ కలిగిన ప్రభుత్వమని, మోనోపాలీ ప్రభుత్వం కాదన్నారు. మూసీతో దక్షిణ తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, అక్కడ మోదీ నమామి గంగే పేరుతో సబర్మతిని క్లీన్ చేసుకుంటే ఇక్కడ మాత్రం గత ప్రభుత్వం దోచుకోవడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. మూసీ ని ప్రక్షాళన చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీర్లను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సన్మానించారు.