రాజకీయ వాంచతో అంకెల గారడీ సిపిఐ నేత బాగం..
సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం..
ఖమ్మం (విజయక్రాంతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణపై మహా వివక్ష ప్రదర్శించారని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు ఆరోపించారు. రాజకీయ వాంచతోనే బిజెపి దాని మిత్రపక్షాలు ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు పెద్దపీట వేశారని భారతదేశ చరిత్రలో ఇంతటి రాజకీయ వివక్ష -ప్రదర్శించిన బడ్జెట్ మరొకటి లేదని ఆయన అభివర్ణించారు. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బైపాస్ రోడ్డులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిపిఐ కార్యాలయం నుండి ప్రదర్శనగా వెళ్లి బైపాస్ రోడ్డులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బాగం హేమంతరావు మాట్లాడుతూ.. తెలంగాణకు కనీసం ఒక ప్రాజెక్టు కూడా కేటాయించకపోగా కనీస ప్రతిపాదన చేయలేదని ఆయన తెలిపారు. కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే మేలు చేసే ఈ బడ్జెట్ను సిపిఐ పూర్తిగా -వ్యతిరేకిస్తుందని హేమంతరావు తెలిపారు.
భారతదేశ రైతాంగం కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో చారిత్రాత్మక -పోరాటం వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధరను కల్పించాలని చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతాంగ డిమాండ్లను పూర్తిగా విస్మరించిందన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతుంటే దానిని పట్టించుకోక పోగా కార్పొరేట్ శక్తులకు మేలు చేసేవిధంగా బడ్జెట్లో అంకెలను పొందుపర్చారని ఆయన తెలిపారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భవిష్యత్తులో దేశాన్ని రుణ భారత్గా మార్చే ప్రమాదం ఉందని సుమారు 13.65 -లక్షల కోట్ల రూపాయల లోటును ఎలా భర్తీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. విద్యా, వైద్య రంగాలను విస్మరించారని ధరల నియంత్రణపై ఊసెత్తలేదని బడ్జెట్లో అంకెలు చూస్తుంటే మోడీ సర్కార్ కార్పొరేట్లు, సంపన్నుల చేతుల్లో బంధీగా మారిందని అవగతమవుతుందని ఈ బడ్జెట్ను వ్యతిరేకించి భవిష్యత్తు పోరాటాలకు సిద్దం కావాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, తోట రామాంజనేయులు, రావి శివరామకృష్ణ, మేకల శ్రీనివాసరావు, ప్రజా సంఘాల నాయకులు గాదె లక్ష్మి నారాయణ, తాటి నిర్మల, ఇటికాల -రామకృష్ణ, ఎస్కె సైదా తదితరులు పాల్గొన్నారు.