calender_icon.png 16 October, 2024 | 2:24 PM

మహా నగారా

16-10-2024 03:07:38 AM

వచ్చే నెలలో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ పోలింగ్

షెడ్యూల్ విడుదల

మహారాష్ట్ర : నవంబర్ 20న ఒకే దఫాలో..

జార్ఖండ్ : నవంబర్ 13, 20 తేదీల్లో 

నవంబర్ 23న రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. దేశంలోనే ధనిక రాష్ట్రమైన మహారాష్ట్రతోపాటు గిరిజన జనాభా ఆధిపత్యం ఉన్న జార్ఖండ్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.

ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ ఈ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీంతో రెండు రాష్ట్రాల్లో వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.

ఒకే దఫాలో మహారాష్ట్ర ఎన్నికలు

దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఈ రాష్ట్ర అసెంబ్లీలో 288 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. నిజానికి హర్యానా, జమ్ముకశ్మీర్‌తోపాటే ఇక్కడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. ఈసీ వాయిదా వేసింది. ఎట్టకేలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 20వ తేదీన ఈ రాష్ట్రంలోని 288 స్థానాలకు ఒకే దఫాలో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 23న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

ఈ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఈ నెల 22న నోటిఫికేషన్ జారీచేస్తారు. ఈ నెల 29వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. మరుసటి రోజు నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 4వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ, ఎన్సీపీ, శివసేన కూటమి అధికారంలో ఉన్నది.

జార్ఖండ్‌లో రెండు దఫాలుగా పోలింగ్

జార్ఖండ్‌లో రెండు దఫాలుగా పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ రాష్ట్రంలో సమస్యాత్మక కేంద్రాలు ఎక్కువగా ఉండటం, అటవీ ప్రాంతం అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నది. జార్ఖండ్ అసెంబ్లీలో 82 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. వీటిలో ఒకటి నామినేటెడ్  స్థానం కాగా, 81 సీట్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం ఇక్కడ జార్ఖండ్ ముక్తిమోర్చా, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ రాష్ట్రంలో మొదటి దఫాలో 43 స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరుగుతుంది. అదే నెల 20వ తేదీన మిగిలిన 38 సీట్లకు పోలింగ్ నిర్వహిస్తారు.

జార్ఖండ్‌లో ఇండియా కూటమి

వచ్చే నెల ఎన్నికలు జరుగనున్న రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ, జార్ఖండ్ లోనూ ఏ ఒక్క పార్టీకి ప్రజలు సంపూర్ణ మెజారిటీ ఇవ్వలేదు. జార్ఖండ్‌లో 2019లో హేమంత్ సొరేన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్‌తో కూడిన యునైటెడ్ ప్రోగ్రెస్సివ్ అలయన్స్ 47 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

ఈ కూటమిలో ఇంకా సీపీఐఎంఎల్, ఆర్జేడీ పార్టీలు కూడా సభ్యులుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో జేఎంఎం 25, కాంగ్రెస్ 17, సీపీఐఎంఎల్ ఒకటి, ఆర్జేడీ ఒక సీటు గెలిచాయి. విపక్ష ఎన్డీయే కూటమిలోని బీజేపీ 25, ఏజేఎస్‌యూ 3, జేడీయూ ఒకటి, ఐఎన్‌డీ ఒక సీటు గెలచుకొన్నాయి. విపక్ష ఎన్డీయే కూటమికి మొత్తం 30 సభ్యుల బలమున్నది. ప్రస్తుతం ఏడు సీట్లు ఖాళీగా ఉన్నాయి.

ఈ రాష్ట్రంలోని 81 సీట్లలో 44 జనరల్ సీట్లు ఉండగా, 28 ఎస్టీ, 9 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు. 2.6 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరిలో 1.29 కోట్లమంది మహిళలు, 1.31 కోట్లమంది పురుష ఓటర్లున్నారు. 66.84 లక్షల మంది యువ ఓటర్లున్నారు. వీరిలో 11.84 లక్షల మంది తొలిసారి ఓటు వేయనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుంది.

మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి

మహారాష్ట్రలో 2019లో హంగ్ ఏర్పడటంతో గత ఐదేండ్లలో ఇక్కడ రాజకీయాల్లో అనేక నాటకీయ పరిణామాలు ఏర్పడ్డాయి. 288 సీట్లలో బీజేపీ 105 స్థానాలు గెలిచింది. నాడు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఉమ్మడి శివసేన 56 సీట్లు గెలిచింది. ఈ రెండు పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటానికి అవసరమైన మెజారిటీ ఉన్నది.

కానీ, సీఎం, మంత్రి పదవుల పంపకాలపై విభేధాలు రావటంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కాంగ్రెస్, ఉమ్మడి ఎన్సీపీతో కలిసి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) పేరుతో కూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చింది. ఉద్ధవ్ సీఎంగా అధికారం చేపట్టారు. కానీ, అ కూటమి ప్రభుత్వం ఎక్కువకాలం అధికారాన్ని నిలుపుకోలేకపో యింది.

శివసేనలోని సీనియర్ నేత, ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేసి శివసేనను రెండు ముక్కలు చేశాడు. దీంతో అతడిని ముందు పెట్టి 2022 జూన్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కొత్తకాలానికి శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా రెండుగా చీలిపోయింది.

పవార్ సోదరుడి కుమారుడు అజిత్‌పవార్ స్వయంగా తిరుగుబాటు చేసి తన వర్గంతో మహాయుతి కూటమి ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్‌పీ) ప్రధాన సభ్యులుగా ఉన్న ఎంవీఏకు, బీజేపీ, శివసే, ఎన్సీపీ సభ్యులుగా ఉన్న మహాయుతి కూటమికి మధ్యనే ప్రధా న పోటీ ఉన్నది.

రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లలో 234 స్థానాలు జనరల్‌వే. 29 ఎస్సీ, 25 ఎస్టీ రిజర్వుడ్ సీట్లు ఉన్నాయి. మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. వీరిలో 4.97 కోట్ల మంది పురుషు లు, 4.66 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 20 నుంచి 29 ఏండ్లలోపు ఓటర్లే ఏకంగా 1.85 కోట్ల మంది ఉన్నారు. 20.93 లక్షల మంది తొలిసారి ఓటు వేయనున్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల కోసం లక్షా 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. 

ఈ ఏడాది చివరి అసెంబ్లీ ఎన్నికలు

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ముగియనున్నాయి. 2024 సంవత్సరం ముగియటానికి ఇంకా రెండున్నర నెలల సమయం ఉన్నది. సెప్టెంబర్ నిర్వహించిన హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 8వ తేదీనే వెలువడ్డాయి. ఆ తర్వాత నెలకే మరో రెండు రాష్ట్రాల ఎన్నికలు ఫలితా లు రానున్నాయి. ఆ పైన ఇక ఏ రాష్ట్రంలో నూ అసెంబ్లీ ఎన్నికలు లేవు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి, అక్టోబర్        నవంబర్‌లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగాల్సి ఉన్నది.

ఈవీఎంల బ్యాటరీ క్యాలిక్కులేటర్ లాంటిది

ఈవీఎంలపై కొన్ని పార్టీలు లేవనెత్తున్న అభ్యంతరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ తోసిపుచ్చారు. హర్యానా ఎన్నికల్లో ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల బ్యాటరీలపై అనుమానాలు వ్యక్తంచేసింది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నల కు సీఈసీ సమాధానమిచ్చారు. ‘ఈవీఎంలకు ఒకసారి మాత్రమే ఉపయో గించే బ్యాటరీలు ఉంటాయి.

అవి కాలిక్యులేటర్‌లాంటివి. మొబైల్ ఫోన్ల లాంటివి కావు. పేజర్లలాగా వీటిని హ్యాక్ చేయటానికి వీలుండదు. పోలింగ్‌కు ఐదారు నెలల ముందే ఈవీఎంల మొదటి దఫా పరిశీలన పూర్తవుతుంది. పోలింగ్‌కు ఐదారు రోజుల ముందు ఈవీఎంను పూర్తిగా సిద్ధం చేస్తాం. అందులో కొత్త బ్యాటరీ అమరుస్తాం’ అని వివరించారు. హర్యానా ఎన్నికల్లో అనూహ్య ఓటమి అనంతరం కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తంచేసింది.

తమ అభ్యర్థులు గెలిచిన చోట వినియోగించిన ఈవీఎంల బ్యాటరీల్లో చార్జింగ్ 60 శాతానికి తగ్గిపోగా, ఓడిన చోట వాడిన ఈవీఎంల బ్యాటరీల్లో చార్జింగ్ 99 శాతం ఉండటం ఏంటని ప్రశ్నించింది. ప్రతి ఎన్నికల్లోనూ ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తప్పుతుండటంపై కూడా సీఈసీ అసహనం వ్యక్తంచేశారు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలతో వాస్తవ           పరిస్థితులను వక్రీకరిస్తున్నారని, దీనిపై ప్రెస్ అండ్ మీడియా అసోసియేషన్ పునరాలోచించుకోవాలని చురక లంటించారు.