మరో మారు గ్రేట్...
మేక్ అమెరికా గ్రేట్ అగేన్.. ఇదీ ట్రంప్ నినాదం. ఎన్నికల్లో ఇదే నినాదంతో ఆయన అనేక మంది అమెరికన్లకు దగ్గరయ్యారు. వారి అభిమానాన్ని పొందారు. అంతలా పాపులర్ అయిన నినాదాన్ని ట్రంప్ వదిలిపెట్టలేదు.
వాషింగ్టన్, జనవరి 20: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా అత్యంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికాను మరోమారు గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానంటూ ఎన్నికల సమయంలో పదే పదే చెప్పిన ట్రంప్ అందులో భాగంగా అమెరికన్లకు పలు హామీలు ఇచ్చారు.
అమెరికాను గొప్ప దేశంగా నిలిపేందుకు పగ్గాలు చేపట్టిన మొదటి రోజు నుంచే చర్యలు తీసుకుంటానన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ సోమవారం బాధ్యతలు స్వీకరించడంతో ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. హామీల అమలుకు ట్రంప్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.
అక్రమ చోరబాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. తాను అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే సరిహద్దును మూసివేసి అక్రమ వలసలను అడ్డుకుంటానని అక్టోబర్ 12న నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీలో ప్రకటించారు.
తాను పగ్గాలు చేపట్టిన వెంటనే ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతానని ఎన్నికల సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. తాజాగా ఈ విషయంపై ట్రంప్ ప్రతినిధి మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై చర్చించేందుకు ఇరు దేశాల నేతలతో ట్రంప్ సమావేశమవుతారని వెల్లడించారు.
దేశ చరిత్రతోనే మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తంలో వలుసదారులను బహిష్కరించే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా ఆక్రమణకు గురైన అమెరికాలోని ప్రతి నగరం, పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని రక్షిస్తానని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా చట్ట ప్రకారం అమెరికాలో జన్మించిన పిల్లలకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. అమెరికాలోని ఈ చట్టం ద్వారా అనేక మంది అక్రమ వసలదారుల పిల్లలకు అగ్రరాజ్యం పౌరసత్వం లభించింది. అయితే అక్రమ వసలదారుల పిల్లలకు ఇలా సహజసిద్ధంగా అమెరికా పౌరసత్వం లభించే విధానానికి ముగింపు పలుకుతానని ట్రంప్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు.
అమెరికాలో కొన్ని పాఠశాలలు లింగమార్పిడిని ప్రోత్సహిస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తు న్నారు. ఈ క్రమంలోనే లింగ మార్పిడిని ప్రోత్సహించే పాఠశాలలకు అందుతున్న ఫెడరల్ నిధుల్లో కోత విధించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తానని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రత్యేకమైన చట్టం తీసుకురాకుండా కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ల ద్వారా పాఠశాలలకు అందుతున్న నిధుల్లో కోత విధించేందుకు అవకాశం ఉండదనే వాదన అక్కడ వినిపిస్తుంది.
గత ఎన్నికల సందర్భంగా ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన కొందరు ఆయన అభిమానులు క్యాపిటల్ భవనంపై దాడికి తెగబడ్డారు. వారిపై బైడెన్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అయితే బైడెన్ ప్రభుత్వం కేసుల పేరుతో నిర్దోషులను వేధించిందని పదే పదే ఆరోపించిన ట్రంప్.. వారికి క్షమాభిక్ష పెట్టనున్నట్టు ఎన్నికల ర్యాలీలో తెలిపారు.
మెక్సికో, కెనడా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 25శాతం సుంకం విధిస్తానని ట్రంప్ గతంలో ప్రకటించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజే అందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తానన్నారు.
జో బైడెన్ ప్రభుత్వం అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనం తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చింది. అయితే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిబంధనను తొలగిస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు.
దేశంలో చమురు ఉత్పత్తి పెంచడంతోపాటు కొత్త పైప్‌లైన్లు, నూతన పవర్ ప్లాంట్, రియాక్టర్‌ల ఏర్పాటు ద్వారా దేశంలో భారీ మొత్తంలో ఇంధన సరఫరాకు చర్యలు తీసుకుంటానని ట్రంప్ ప్రకటించారు. ఇందుకోసం దేశంలో నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటిస్తానన్నారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌పై నిషేధాన్ని వాయిదా వేస్తానని వెల్లడించారు. ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
దేశాన్ని ద్వేషించే రాజకీయ వర్గాన్ని అమెరికా నుంచి తరమికొడతామని ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పేర్కొన్నారు. కమ్యూనిస్టు, మార్క్సి స్టు, ఫాసిస్టు భావజాలాలు ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తప్పు డు కథనాలను ప్రసారం చేసే మీడియా సంస్థలపైనా చర్యలు తప్పవన్నారు.
నాటి రోజులు గుర్తుకు తెచ్చిన ట్రంప్
40ఏండ్ల కిందట అధ్యక్షుడిగా ఎన్నికైన రొనాల్డ్ రీగన్ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో కూడా ఇలాగే విపరీతమైన శీతల వాతావరణ పరిస్థితులు ఉండడంతో ఆయన కూడా క్యాపిటల్ భవంతి లోపలే ప్రమాణ స్వీకారం చేశారు.
మరలా 40 ఏండ్ల తర్వాత ట్రంప్ కూడా అదే విధంగా క్యాపిటల్ భవంతి లోపల ప్రమాణ స్వీకారం చేశారు. ఆనాడు భవంతి లోపల ప్రమాణ స్వీకారం చేపట్టిన రొనాల్డ్ కూడా రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినపుడే ఇలా జరగడం విశేషం. ఈ చలిలో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక క్యాపిటల్ భవంతిలో ప్రమాణస్వీకారం చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
వణుకుతున్న అమెరికా
అమెరికా వణుకుతోంది. అక్కడ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో జనజీవనం అనేక అవస్థలు పడుతోంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే రోజు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండి చలి పులి అతిథులతో పాటు వచ్చిన అశేష ప్రజానీకాన్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తుందనే ముందస్తు సమాచారంతో ట్రంప్ వేదికను భవంతి లోపలకు మార్చారు.
అధ్యక్షుడిగా జో బైడెన్ చిట్టచివరి నిర్ణయం
అమెరికా అధ్యక్షుడి హోదాలో జో బైడెన్ చిట్ట చివరిగా డాక్టర్ ఆంథోనీ ఫౌసీ, రిటైర్డ్ జనరల మార్క్ మిల్లెకు ముందస్తు క్షమాభిక్ష ఆదేశాలు జారీ చేశారు. వీరితోపాటు క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకూ బైడెన్ ఉపశమనం కలిగించారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లపై ప్రతీకార చర్యలు తీసుకునే వీలు లేకుండా ముందస్తు క్షమాభిక్ష అదేశాలు జారీ చేసినట్టు బైడెన్ వెల్లడించారు.
కొవిడ్ సమయంలో డాక్టర్ ఫౌసీ కీలకంగా వ్యవహరించారు. కొవిడ్ సమయంలో ఫౌసీ మాస్కు తప్పనిసరి సహా పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ మార్గదర్శకాలపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. 2020 ఎన్నికల తర్వాత క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసును జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ హోదాలో రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె పర్యవేక్షించారు. ఈ కేసులో ట్రంప్ మద్దతుదారులపై కేసులు నమోదయ్యాయి.
ట్రంపెడు భయం
- హెచ్ వీసాదారుల్లో అభద్రతా భావం
సుదీర్ఘకాలంగా గ్రీన్‌కార్డు కోసం వేలాది మంది ఎదురుచూపులు
అమెరికా కొత్త అధ్యక్షుడి నిర్ణయాలపై ఉత్కంఠ
వాషింగ్టన్, జనవరి 20: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకోవడంతో హెచ్ వీసా హోల్డర్లలో ఆందోళన పెరిగింది. ఆయన ఎలాంటి ఆంక్షలు విధిస్తారోనని ఆవేదన చెందుతున్నారు. సుదీర్ఘకాలంగా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారు తమ భవిష్యత్‌పై అభద్రతా భావంతో ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
యూఎస్‌లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులు తాత్కాలిక వీసాలు, బిల్లుల చెల్లింపు, ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లో ఉపాధి దొరుకుతుందనే ఆందోళనల మధ్య అక్కడే ఉండి అమెరికన్‌గా ఉండడానికి ప్రయత్నిస్తారు. హెచ్ వీసాల్లో భారతీయులదే ఆధిపత్యం. 72శాతం భారతీయులే ఉన్నారు. హెచ్ వీసాతో ఒక వ్యక్తి అమెరికాలో ఆరేండ్లపాటు ఉండొచ్చు. మొదట మూడు సంవత్సరాలకు మంజూరు చేయబడిన, ఆ తర్వాత మరో మూడు సంవత్సరాలు పొడిగించవచ్చు.
అయితే హెచ్‌హౌ వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు అమెరికా దాటి వెళ్లకూడదు. ఈ నేపథ్యంలో అమెరికాలో హెచ్ వీసా కోసం ఎదురుచూడటం, ఉద్యోగం కోసం వెతుక్కోవడం, అమెరికాలో నివసించడానికి భారీగా ఖర్చు పెట్టాల్సిరావడంతో సోషల్ మీడియాలో వారు నిరాశను వ్యక్తం చేస్తుంటారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకోవడంతో హెచ్ వీసాదారులు మరింత భయపడిపోతున్నారు. చాలామంది భారతీయ హెచ్ వీసా హోల్డర్లు యూఎస్ వెలుపల ప్రయాణించవద్దని తమకు యజమానులు, న్యాయవాదులు సలహా ఇచ్చారని వాపోతున్నారు. అలాగే ముంబైకి వెళ్లిన ఓ ఇంజినీర్‌ను జనవరి 20లోగా కాలిఫోర్నియా రావాలని అతడి న్యాయవాది కోరాడట. ఓ నెటిజన్ పోస్టు చేస్తూ “నా హెచ్ వీసా పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్నాను.
అంతులేని చక్రంలో అనిశ్చితి, ఆందోళనతో కూరుకుపోయాను. ఏం జరుగుతుందో తెలియక చింతిస్తూనే ఉన్నా..” అని వాపోయాడు. “మీరు యూఎస్‌లో ఎంతకాలం ఉంటారో కచ్చితంగా తెలియదు. కానీ సమస్య ఏమిటంటే మీరు ఇక్కడే వృద్ధులైపోతారు. అద్దె ఇల్లు, చౌకైన ఫర్నిచర్, డొక్కు కారుతో నివసిస్తారు..మీరు ఇవన్నీ గ్రహించేసరికే సమయం మించిపోతుంది..” అంటూ ఓ వ్యక్తి హెచ్చరించాడు.
యూఎస్‌లో ఏళ్ల తరబడి జీవిస్తున్న ప్రజలు కూడా హెచ్ వీసా ప్రక్రియ గురించి భయపడుతుంటారు. వారిలో నిత్యం భయం, ఆందోళన, నిరాశ ఉంటాయని మరొకరు పోస్టు చేశారు. ఇంకొందరు మానసిక సమస్యలు ఉన్నా హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే అది గ్రీన్‌కార్డు మంజూరులో ప్రభావం చూపుతుందని భయపడుతారని కొందరు చెబుతున్నారు. అమెరికా గ్రీన్ కార్డు కోసం పది లక్షల కంటే ఎక్కువ భారతీయులు వేచి చూస్తుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.