దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మహారాష్ట్ర, జార్ఖం డ్ అసెంబ్లీ ఫలితాలు ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను మించి అనూ హ్య ఫలితాలను అందించాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమి విజయం సాధిస్తుందని, తిరిగి అధికారం చేజిక్కించు కుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. జార్ఖండ్‌లో కూడా బీజేపీ కూటమి విజయం సాధించవచ్చని పేర్కొన్నాయి.
అయితే నువ్వా, నేనా అన్నట్లుగా సాగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అఖండ విజయాన్ని సాధించగా, జార్ఖం డ్‌లో అన్ని ప్రతికూలతలను అధిగమించి ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ నేతృత్వంలోని జేఎంఎంకాంగ్రెస్ కూటమి తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. నిజానికి మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఇంతటి ఘన విజ యాన్ని సాధిస్తుందని రాజకీయ పండితులు సైతం ఊహించలేదు.
288 అసెంబ్లీ స్థానాల్లో కూటమికి 234 స్థానాలు అంటే మూడింట రెండువంతులకుపైగా మెజారిటీ లభించింది. కూటమిలో 149 స్థానాలకు పోటీ చేసిన బీజేపీ ఏకంగా 132 స్థానాల్లో విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు కేవలం 13 సీట్ల దూరంలో నిలిచింది. శివసేన షిండే వర్గం 57, స్థానాల్లో ఎన్సీపీ పవార్ వర్గం 41 స్థానాల్లో గెలుపొందాయి. మరోవైపు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డిన మహావికాస్ అఘాడీ కేవలం 50 స్థానాలకు పరిమితమయింది.
ఇంతటి ఘన విజయం సాధించడానికి కమలదళానికి అనుకూలించిన అంశాలను ఒక్కసారి గమనిస్తే ఆరునెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరాభవాలు, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అనూహ్య విజయంనుంచి ఆ పార్టీ అనేక గుణపాఠాలను నేర్చుకుందని స్పష్టమవుతుంది. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం చివరిదాకా కూడా కూటమిలోని మూడుపార్టీల మధ్య ఎక్కడా సమన్వయ లోపం, పొరపచ్చాలు రాకుండా జాగ్రత్త పడింది.
ఓబీసీ ఓట్ల సమీకరణ, ఆకర్షణీయ పథకాలు, మహిళల ఓట్లు, మోదీలాంటి బీజేపీ అగ్రనేతల ప్రచారం విజయంలో కీలక పాత్ర పోషించాయి. చివరికి రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న మరాఠాలు సైతం కూటమికే పట్టం కట్టారు. ప్రభుత్వం ఏర్పాటులో అత్యంత కీలకమై న విదర్భ ప్రాంతంలోని 62 సీట్లలో మహాయుతి 40 సీట్లను గెలుచుకోవడం గమనార్హం. విదర్భలోనే రైతు అత్యహత్యలు ఎక్కువగా జరిగాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో అఘాడీ ఇక్కడ 10 స్థానాల్లో విజయం సాధించిం ది.
ఇదే ప్రాంతంలో ప్రధాన కార్యాలయం ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీపై ఆగ్రహంతో ఉన్నా ఈసారి పూర్తిగా మహాయుతికి సహకారం అందించింది. క్షేత్రస్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార వ్యూహాలు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఫలితంగా గతంలో ఎన్నడూ చవిచూడని ఘనవిజయాన్ని దక్కించుకుంది.
ఇక జార్ఖండ్‌లో జేఎంఎం అధినేత, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఏటికి ఎదురీది ఒంటి చేత్తో విజయాన్ని సాధించారని చెప్పవచ్చు. తనపై ప్రధాని మోదీ మొదలుకొని బీజేపీ నేతలు చేసిన అవినీతి ఆరోపణల తుపానుకు ఎదురొడ్డి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. రాష్ట్రంలో26 శాతానికి పైగా ఉన్న గిరిజనుల్లో తనకున్న పలుకుబడితో పాటుగా తన ప్రభుత్వం వారికోసం తీసుకువచ్చిన పథకాలను ప్రచారం లో ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ఓట్లుగా మలుచుకోగలిగారు.
అంతేకాదు బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనుల సంపదను దోచుకుంటుందంటూ ఆయన చేసిన ప్రచారమూ సత్ఫలితాలనిచ్చింది. అందుకే 81 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో జేఎంఎం కూటమి 56 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. మరోవైపు బీజేపీ కూటమిలో హేమంత్‌కు దీటైన గిరిజన నాయకుడు లేకపోవడం పెద్ద లోపమైంది. బాబూలాల్ మరాండీ, చంపై సొరేన్ లాంటి మాజీ సీఎంలు ఓట్లు తెచ్చిపెడతారనుకున్నా అది జరగలేదు. ఫలితంగా కమలం కూటమి 24 సీట్లకే పరిమితమయింది. మహా రాష్ట్రలో ఘోరపరాజయాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి ఈ విజయం కాస్త ఓదార్పు అని చెప్పవచ్చు.