04-04-2025 12:16:10 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం
రాజేంద్రనగర్, ఏప్రిల్ 3(విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న టైం స్కేలు ఉద్యోగస్తుల దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పదవీ విరమణ ప్రయోజనాల అంశం కొలిక్కి వచ్చింది. 2008లో నాటి ముఖ్యమంత్రి వై ఎస్సార్, వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి కాలంలో విశ్వవిద్యాల యంలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ వ్యవసాయ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నారు.
నేటి వరకు ఉద్యోగ భద్రత తప్ప మిగతా ఎలాంటి ప్రయోజనాలు లేకపోవటం, వాటి పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. దాదాపు ప్రతి టైం స్కేలు ఉద్యోగి 35-40 ఏళ్ళు విశ్వవిద్యాలయంలో సేవచేసి పదవీ విరమణ సమయంలో ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేక రిక్త హస్తాలతో నేటి వరకు పదవీ విరమణ చేయాల్సి వస్తుంది.
ఇదే విషయాన్ని టైంస్కేలు ఉద్యోగస్తులు గత 17 ఏళ్లుగా పలుమార్లు విశ్వవిద్యాలయ యాజమాన్యానికి విన్నవించుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుత ఉపకులపతి ప్రొ. అల్ట్రాస్ జానయ్య పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత టైంస్కేలు ఉద్యోగస్తులు అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను వారి దృష్టికి మరోసారి తీసుకువచ్చారు.
సానుకూలంగా స్పందిస్తూ గత నెల 25న జరిగిన విశ్వవిద్యాలయ పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ప్రతి టైంస్కేలు ఉద్యోగికి పదవీ విరమణ సమయంలో 3 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని పాలక మండలి ని ర్ణయించినట్లు ఉపకులపతి అల్టాస్ జానయ్య తెలిపారు.
గురువారం విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివిధ కళాశాలలు, పరిశోధనా సంస్థలలో పరిచేస్తున్న సుమారు 200 మంది టైంస్కేలు ఉద్యోగస్తులు విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం ముందు సమావేశమై విశ్వవిద్యాలయ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపకులపతి జానయ్య, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన, ఆలోచన మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయానికి అనుగుణంగా పాలక మండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగ విరమణ ప్రయోజనమైన 3 లక్షల రూపాయిల గ్రాట్యుటీ కల్పిస్తూ విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయాన్ని టైం స్కేల్ ఉద్యోగులు హర్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.