27-04-2025 12:00:00 AM
ప్రేక్షకుల మెప్పు పొందడానికి మూవీ మేకర్స్ ప్రయోగిస్తున్న మంత్రదండం వీఎఫ్‌ఎక్స్! ఈ మ్యాజిక్ కారణంగానే బాక్సాఫీస్ వద్ద కాసులు రాలుతున్నాయి. క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం భారీగా ఖర్చుపెట్టి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతున్న సినిమాలెన్నో.
ప్రతి సినిమా అంతిమ లక్ష్యం
ప్రేక్షకులకు వినోదం పంచడమే. ఈక్రమంలో సినీప్రియుల మెప్పు పొందడం కోసం మేకర్స్ చేసే జిమ్మిక్కులు చాలానే ఉంటాయి. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులను విభిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో గ్రాఫిక్స్‌దే కీలక పాత్ర అని ఫిక్సయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలో వీఎఫ్‌ఎక్స్ ప్రధానంగా పలు సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి.
- నరేశ్ ఆరుట్ల
‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ వీఎఫ్‌ఎక్స్ కోసమే రూ.200 కోట్లు
‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’లతో సరికొత్త విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన రాజమౌళి దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మహేశ్‌బాబు సినిమాకు అంతకుమించి చూపించబోతున్నారు. ఈ సినిమాకి వీఎఫ్‌ఎక్స్‌కే రూ.200 కోట్లు పెట్టడం ఖాయం అంటున్నారు.
వీఎఫ్‌ఎక్స్ వర్క్ కారణంగానే ‘రాజాసాబ్’ ఆలస్యం
షూటింగ్ అయిపోయినా వీఎఫ్‌ఎక్ పని కాకపోవడం వల్ల ప్రేక్షకుల ముందుకు రాని సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో మొదటి స్థానం ‘రాజాసాబ్’దే. ప్రభాస్, మారుతి కలయి కలో ఈ సినిమా హార్రర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు అయిపోయిందని, గ్రాఫిక్స్ వర్కే మిగిలి ఉందని, మూడు బృందాలు పనిచేస్తున్నాయని ఇటీవల దర్శకుడు మారుతి వెల్లడించిన సంగతి తెలిసిందే. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దాదాపు అంతా వీఎఫ్‌ఎక్స్ వర్క్ మాత్రమే ఉందని తెలుస్తోంది.
‘వీరమల్లు’ది అదే దారి..
ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాల్లో ‘హరిహరవీరమల్లు’ ఒకటి. ఇందులో కూడా గ్రాఫిక్స్ మేజర్ పార్ట్ కాబోతోంది. పవన్‌కళ్యాణ్, జ్యోతికృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. హిస్టారికల్ యాక్షన్ డ్రామా కాబట్టి అప్పటి నేటివిటీని క్రియేట్ చెయ్యడం, యాక్షన్ సీన్స్, యాంబియెన్స్ కోసం గ్రాఫిక్స్ వాడాల్సిందే. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్స్‌లో గ్రాఫిక్స్ క్వాలిటీతో ఉండడంతో ఇక ఫుల్ సినిమాలో విజువల్స్ ఎలా ఉంటాయో అని ఆసక్తిగా చూస్తున్నారు ప్రేక్షకులు. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు 100 కోట్లు పెడుతున్నట్టు తెలుస్తోంది.
జై హనుమాన్..
రాజమౌళి రేంజ్ గ్రాఫిక్స్‌ను చూపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సినిమా ‘హనుమాన్’. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రాబోతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విజువల్ వైజ్‌గా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తక్కువ బడ్జెట్‌లోనే బెటర్ విజువల్స్ ఇస్తున్న ప్రశాంత్‌వర్మ ఈ చిత్రంలో ఇంకేం చూపిస్తాడోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొని ఉంది.
మొదటి భాగాన్ని మించేలా ‘అఖండ2’
ఈ ఏడాది విడుదల కానున్న ఇంట్రస్టింగ్ గ్రాఫికల్ చిత్రాల్లో ‘అఖండ2’ కూడా ఒకటి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో పవర్‌ఫుల్‌గా వస్తున్న అఖండ సీక్వెల్ ఈసారి ఫస్ట్ పార్ట్‌ను మించిన విజువల్స్‌తో సిద్ధమవుతోంది. ‘అఖండ’లోనే అమేజింగ్ విజువల్స్ చూపించిన టీమ్ రెండోభాగంలో మరోస్థాయి వీఎఫ్‌ఎక్స్ చూపించబోతోందంటున్నారు బాలయ్య అభిమానులు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు.. కన్నప్ప
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ ఆలస్యానికి ముఖ్య కారణం కూడా విజువల్స్ అని టాక్. ఇప్పటికే పూర్తయిన ఈ ప్రాజెక్టు గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ మరింత మెరుగ్గా తీర్చిదిద్దే పనిలో టీమ్ తలమునకలై ఉంది. అందుకే ఇంకా కరెక్షన్స్ చేస్తూ మెరుగు పర్చే పనిలో ఉన్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ స్టార్ కాస్ట్ మూవీ జూన్ 27న థియేటర్లలోకి వస్తోంది.
సాయిదుర్గాతేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్‌గా ‘సంబరాల ఏటిగట్టు’
సాయిదుర్గాతేజ్ కెరీర్‌లో భారీ చిత్రంగా రాబోతోంది ‘సంబరాల ఏటిగట్టు’. విజువల్‌గా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోందీ సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో మేజర్ పార్ట్ గ్రాఫిక్సే ఉండబోతున్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లు అయితే వీఎఫ్‌ఎక్స్‌కు 25 కోట్లు పైనే ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.
75 కోట్లతో విశ్వంభర గ్రాఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ‘విశ్వంభర’. ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అయితే గ్రాఫిక్స్ కోసమే 75 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టు సమాచారం. గ్లింప్స్ తర్వాత వీఎఫ్‌ఎక్స్ విషయంలో ట్రోల్స్ రావడంతో ఇప్పటికే మార్పులు చేస్తున్న టీమ్ ఈసారి ఎలాంటి విమర్శలకు తావు లేకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చూస్తోంది.
అల్లు అర్జున్ చిత్రం కోసం హాలీవుడ్ సంస్థ వర్క్
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సూపర్ ఫాస్ట్‌గా జరుగుతోంది. లేటెస్ట్‌గా ముంబైలోని మోహబూబ్ స్టూడియోలో అల్లు అర్జున్‌పై లుక్‌టెస్ట్‌తోపాటు కాన్సెప్ట్ ఫొటోషూట్ చేసినట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యార్లల్ స్పేస్, పునర్జన్మల కాన్సెస్ట్‌తో వస్తోన్న ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ గెటప్‌లో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకు తగ్గట్లే రగ్గడ్, స్లీక్, ఫ్యూచరిస్టిక్, ఔటర్ స్పేస్ ఇలా కొన్ని లుక్స్‌ను అల్లు అర్జున్‌పై కాన్సెప్ట్ ఫొటోషూట్ చేసినట్లు తెలుస్తోంది. వీటిలో దాదాపు రెండు లుక్స్‌ను ఫైనల్ చేసే ఛాన్సుంది. మహేశ్ తర్వాత ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే. హాలీవుడ్ టాప్ వీఎఫ్‌ఎక్స్ టెక్నిషియన్స్ లోలా వీఎఫ్‌ఎక్స్ ఈ ప్రాజెక్ట్‌లో పార్ట్ అవ్వడంతో మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈజీగా 150 కోట్లు వీఎఫ్‌ఎక్స్ కోసమేనని టాక్.