calender_icon.png 23 October, 2024 | 3:03 PM

వక్ఫ్ భూములుగా పట్టా స్థలాలు

29-08-2024 04:34:58 AM

  1. ధరణి వచ్చాకే మార్చారు 
  2. ఎంపీ డీకే అరుణకు రైతుల ఫిర్యాదు 
  3. జేపీసీలో చర్చిస్తామని ఎంపీ హామీ

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అప్పటివరకు పట్టా భూములుగా ఉన్న వాటిని వక్ఫ్ భూములుగా మార్చేశారని పలువురు రైతులు తన దృష్టికి తీసుకువస్తున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యురాలైన డీకే అరుణకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన రైతులు తమ సమస్యలు చెప్పు కొంటున్నారు. రెండు రోజులుగా వక్ఫ్ పేరిట నష్టపోయిన రైతులు జూబ్లీహిల్స్‌లోని ఎంపీ నివాసానికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఏళ్లుగా తాము వ్యవసాయం చేస్తున్న భూములను వక్ఫ్ భూములంటూ ఆక్రమించుకు న్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

స్వాతంత్య్రం రాకముందు తమ తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములను ధరణి తర్వాత వక్ఫ్ భూములంటూ వేధిస్తున్నారని ఎంపీ దృష్టికి తెచ్చారు. రైతుబంధు, రైతుబీమా వర్తించలేదని ఎంపీకి వివరించారు. కనీసం పంట రుణాలు తీసుకునేందు కు కూడా అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రైతుల సమస్యలను జేపీసీ ముందుంచి పరిష్కారం కోసం కృషి చేస్తానని డీకే అరుణ వారికి హామీ ఇచ్చారు.

పూర్వీకుల నుంచి వ్యవసాయం చేస్తున్న భూములను ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత వక్ఫ్ పేరిట అన్యాయానికి గురి చేయడం సరికాదని డీకే అరుణ అన్నారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. జహీరాబాద్, నర్సాపూర్, తూఫ్రాన్, బోడుప్పల్‌కు చెందిన రైతులు డీకే అరుణను కలిసి తమ సమస్యలను వివరించి న్యాయం చేయాలని కోరారు.