నూతన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజురు
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం కృషి చేయాలి
మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు
మెదక్,(విజయక్రాంతి): మెదక్ నియోజకవర్గానికి రూ.26 కోట్ల రూపాయలతో నర్సింగ్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత పదేండ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మెదక్ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. మెడికల్ కళాశాల విషయంలో ఆనాటి ప్రభుత్వం కొబ్బరికాయలు కొట్టి మమా అనిపించుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలను మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో 26 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను మంజూరు చేయడం జరిగిందని, అందులో మెదక్ నియోజకవర్గంకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయ్యిందని వివరించారు.
రోడ్డుప్రమాదాలను అరికట్టాలి
మెదక్ జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆదేశించారు. శుక్రవారం మెదక్ నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై పర్యటించిన ఆయన పట్టణంలోని పిల్లికొట్టాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులతో మాట్లాడారు. ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలతో పాటు మద్యం సేవించి వాహనాలను నడపవద్దని ఆయన పేర్కోన్నారు.