ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలో జాతీయ స్థాయి చేపల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు. ఆదివారం ఎమ్మెల్యే, మత్స్య, నీటిపారుదల శాఖల అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు పక్కన స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర గుర్తింపు పొందిన కొరమీన చేపల పెంపకంకు కేంద్రం రూ.45 కోట్లు, రాష్ట్రం రూ.15 కోట్ల వ్యయం చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 30 ఎకరాల్లో చేప పిల్లల పెంపకం చేపట్టనున్నామన్నారు. అలాగే 50 ఎకరాల్లో ఆక్వా కల్చర్ ఏర్పాటుకు కేంద్రం 35 కోట్లు, రాష్ట్రం 25 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోగా మంచిర్యాలకు ఈ సువర్ణ అవకాశం దక్కిందన్నారు. దేశంలోనే తొలి ఫిష్ పాండ్ అని చెప్పారు. ఫిష్ పాండ్ లో పెంచిన చేపలు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫిష్ పాండ్ ను ఎల్లంపల్లి వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించడం మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని తెలిపారు. ఫిష్ పాండ్ వల్ల మత్స్యకారులకు, స్థానికులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే హజీపూర్ మండలం వేంపల్లి వద్ద ఇండస్ట్రీయల్ ప్రాంగణం ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.