calender_icon.png 17 January, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ అనుమతులివ్వoడి

17-01-2025 01:48:36 AM

  1. అనుమతుల్లేక నిలిచిన రోడ్లు, టవర్ల నిర్మాణ పనులు 
  2. బస్సులను ఎలక్ట్రిక్ మాడల్‌లోకి మార్చేందుకు సహకరించండి
  3. కేంద్రమంత్రులు భూపేందర్ యాదవ్, కుమారస్వామికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞపి

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): అటవీ శాఖ అనుమతులు రాకపో వడంతో తెలంగాణ వ్యాప్తంగా 161 అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, వాటికి వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కోరారు. సీఎం ఈ మేరకు ఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భవన్‌లో కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.

161 పనుల్లో 38 ప్రాజెక్టులకు వన్యప్రాణి సంరక్షణ పరమైన అనుమతులు రావాల్సి ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 161 పనుల్లో ఎక్కువశాతం మారుమూల ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపారు. పనులకు అనుమతులు రాకపోవడంతో జాతీ య రహదారుల నిర్మాణానికి బ్రేక్ పడుతున్నదని, ఏజెన్సీ ప్రాంతాల్లో టవర్ల నిర్మా ణం కష్టతరమవుతున్నదన్నారు. పొరుగు రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారుల పనులు నిలిచిపోయాయన్నారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం తెలిపారు. 

హైదరాబాద్ నగరంలో వంద శాతం బస్సులను ఎలక్ట్రికల్ మాడల్‌లోకి మార్చేందుకు కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కోరారు. పీఎం ఈ పథ కంలో భాగంగా జీసీసీ పద్ధతిలో బస్సులు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు గుర్తుచేశారు.

ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చి, రిట్రో ఫిట్‌మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు కేటాయించే 2,800 బస్సులను జీసీసీ, రిట్రో ఫిట్‌మెంట్ మాడల్ కింద కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 

మంత్రి శ్రీనివాసవర్మతో భేటీ

సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహా య మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. ఢిల్లీ పర్యటనలో సీఎం వెంట రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ, మహబూబాబాద్ ఎంపీలు రఘువీర్‌రెడ్డి, బలరాంనాయక్, సీఎస్ శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వీ శేషాద్రి, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, పీసీసీఎఫ్ డోబ్రియల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.