calender_icon.png 26 April, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభాకర్‌రావుకు బెయిల్ ఇవ్వండి

26-04-2025 01:24:46 AM

  1. ఇదే కేసులో శ్రవణ్‌రావుకు ఇచ్చారు
  2. హైకోర్టులో ప్రభాకర్‌రావు లాయర్ వాదనలు
  3. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు
  4. విచారణ ఈ నెల 29కి వాయిదా

హైదరాబాద్, ఏప్రిల్ 25: రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు హైకోర్టులో పిటిషన్ వేయగా, దీనిపై శుక్రవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ప్రభాకర్‌రావు తరఫున ప్రముఖ న్యాయవాది సీ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభాకర్‌రావుకు 65 ఏండ్లని, ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని చెప్పారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే హైదరాబాద్‌కు వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు. ఇదే వ్యవహారంలో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసినందున, ప్రభాకర్‌రావుకు సైతం ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. రాజకీయ కక్ష సాధింపు చర్యగా ప్రభాకర్‌రావును ఈ కేసులో ఇరికించారని న్యాయస్థానికి తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలను ధ్వంసం చేశారన్నది నిజం కాదని వివరించారు. బెయిల్ మంజూరు చేస్తే సహకరించేందుకు ప్రభాకర్‌రావు సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. పోలీసుల తరఫున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. 65 ఏండ్లు వయస్సుందన్న సాకుతో ప్రభాకర్‌రావు విచారణ నుంచి తప్పించుకోలేరన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయని, హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసి, నీళ్లలో పడేసినట్టు దర్యాప్తులో తెలిందన్నారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయడం సరికాదన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.