calender_icon.png 19 October, 2024 | 4:59 AM

గ్రానైట్ పరిశ్రమను కాపాడాలి

19-10-2024 12:51:29 AM

  1. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి 
  2. గ్రానైట్ స్లాబ్ ఓనర్స్ అసోసియేషన్  జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ 

ఖమ్మం, అక్టోబర్ 18 (విజయక్రాంతి): గ్రానైట్ పరిశ్రమను కాపాడాలని ప్రభుత్వాన్ని గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉప్పల వెంకటరమణ రాష్ట్ర  కోరారు. గ్రానైట్ ఇండస్ట్రీకి సంబంధించి 2023 డిసెంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న రూ. 22  కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

శుక్రవారం ఓ హోటల్‌లో  నూతనకార్యవర్గ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గ్రానైట్ పరిశ్రమకు రాయితీ చెల్లింపునకు అవసరమైన జీవో గడువు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు సమస్యలను వివరించగా, సానుకూలంగా స్పందించారన్నారు.

అసోసియేషన్  జిల్లా నూతన కార్యవర్గం ఈనెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి,  ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు,అన్ని పార్టీల నాయకులు, రాష్ట్ర గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షులు రాయల నాగేశ్వరరావు హాజరవుతారని తెలిపారు.

సమావేశంలో  అసోసియే షన్ అధ్యక్షులు పాటిబండ్ల యుగంధర్, ప్రధాన కార్యదర్శి  కమరపు గోపాలరావు,  కోశాధికారి  మారంరెడ్డి  పరమేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షులు  శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, తమ్మినేని సాగర్, కార్యనిర్వహక సభ్యులు స్వేధర్ తదితరులు పాల్గొన్నారు.