పుష్కరకాల నిరీక్షణకు తెర
దుబాయ్: భారత్ నుంచి మరో గ్రాండ్‌మాస్టర్ అవతరించాడు. తమిళనాడుకు చెందిన 31 ఏళ్ల శ్యామ్ నిఖిల్ భారత 85వ గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన పోలీస్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో శ్యామ్ నిఖిల్ ఈ ఘనత సాధించాడు. గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా దక్కాలంటే 2500 ఎలో రేటింగ్ పాయింట్స్‌తో పాటు మూడు జీఎం నార్మ్‌లు తప్పనిసారి. అయితే 2012లోనే నిఖిల్ 2500 పాయింట్స్‌తో పాటు రెండు జీఎం నార్మ్‌లు సాధించాడు. ఇక మూడో జీఎం పూర్తి చేయడానికి అతడికి పుష్కరకాలం పట్టింది. కాగా ఈ ఏడాది శ్యామ్ నిఖిల్ గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకోగా.. 2023 ఏడాదిలో భారత్ నుంచి ఏడుగురు జీఎం హోదా పొందారు. వారిలో ఆర్. వైశాలీ, కౌస్తవ్ చటర్జీ, ఎం ప్రణేశ్, ఎన్‌ఆర్ విగ్నేశ్, సయంతన్ దాస్, ఉప్పాల ప్రణీత్, ఆదిత్య సమంత్ ఉన్నారు. ఇక కొన్నేళ్లుగా చెస్ క్రీడలో భారత్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. అర్జున్ ఇరిగైసి, కోనేరు హంపి, గుకేశ్, విదిత్ గుజరాతీ, ఆర్ ప్రజ్ఞానంద, ఆర్ వైశాలీ తదితరులు విశ్వవేదికపై విజయాలు సాధిస్తున్నారు. ఇటీవలే గుకేశ్ ఫిడే క్యాండిడేట్స్ చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. 2023లో ప్రజ్ఞానంద చెస్ వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.