calender_icon.png 20 April, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బువ్వ బాగున్నదని.. అవ్వ నవ్వింది!

20-04-2025 01:20:01 AM

సన్నబియ్యం సక్సెస్

రేషన్ షాపులకు జనం పరుగులు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దీవెనలు.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జేజేలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నది. తాజాగా రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నది. ఇందులో రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృషి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.

దొడ్డుబియ్యం స్థానంలో తమకు సన్నబియ్యం అందుతుండటంతో లబ్ధిదారులు సంబురపడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర వెచ్చించి సన్నబియ్యం కొనే బాధ తప్పిందంటూ ఆనందపడుతున్నారు. ఇది మంచి పథకమని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ వేగంగా జరుగుతున్నది. పథకం ప్రారంభమైన రెండు వారాలకే ఏప్రిల్ నెల లక్ష్యం ౯౦శాతం పూర్తికావడం విశేషం. 

సన్నబియ్యం పంపిణీ సక్సెస్

పంపిణీ వివరాలు..

* నెలకు అవసరమైన బియ్యం -సుమారు  2 లక్షల మెట్రిక్ టన్నులు

* లబ్ధిదారులు (కొత్తకార్డులతో కలిపి)  - 3.10 కోట్ల మంది

రేషన్‌షాపులకు లబ్ధిదారుల పరుగులు

  1. వచ్చిన స్టాక్ వచ్చినట్టే ఖాళీ
  2. రెండు వారాల్లో 90శాతం టార్గెట్ పూర్తి
  3. నాణ్యమైన బియ్యం అందిందంటున్న లబ్ధిదారులు
  4. సీఎం రేవంత్‌రెడ్డికి దీవెనలు.. మంత్రి ఉత్తమ్‌కు జేజేలు

విజయక్రాంతి, నెట్‌వర్క్, ఏప్రిల్ 19 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల సబ్సిడీ భ రించి మరీ పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం లో 90శాతం వరకు దుర్వినియోగం అవుతుండడాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించిం ది. దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం పం పిణీ చేస్తే ఒక విత్తు కూడా వృథా కాదని నిర్ధారణకు వచ్చి రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయిచింది.

ప్రతి కుటుంబంలో ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీకి ప్రణాళిక లు సిద్ధం చేసింది. ఉగాది పండుగను పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 1న సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రతిష్ఠాత్మకంగా సన్నబియ్యం పంపణీ పథకానికి శ్రీకారం చుట్టారు. తద్వా రా అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ని నెలబెట్టుకున్నారు. 

విశేష స్పందన..

దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారులు ప్రతినెలా రేషన్ తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించేవారు  కాదు. కోటా బియ్యం తీసుకునే ఆ  కొద్దిమంది కూడా కి లో బియ్యాన్ని రూ.8  చొప్పున వ్యాపారులకు అమ్మేసేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థి తి మారింది. ప్రభుత్వం సన్నబియ్యం పంపి ణీ చేస్తున్నదని తెలిసి లబ్ధిదారులు రేషన్ పంపిణీ కేంద్రాల వద్ద క్యూకడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా స్టాక్ ఖాళీ అవుతున్నదని డీలర్లు వెల్లడిస్తున్నారు.

దొడ్డు బియ్యం పంపిణీ కాలంలో నెలకు 80శాతం మేరకే పంపిణీ పూర్తయ్యేదని, కానీ.. ఈ నెల లో ఇప్పటికే 91శాతానికి పైగా పంపిణీ పూర్తయిందని పౌర సరఫరాలశాఖ ఉన్నతాధి కారులు వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 91.19 లక్షల రేషన్‌కార్డు లు ఉన్నాయి. వీటి ద్వారా 2.82 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారు. ఒకవేళ కొత్త రేషన్‌కార్డులతో ఆ సంఖ్య 3.10 కోట్లకు చేరుకోనున్న ది. అందుకు తగిన విధంగా సర్కార్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది.

వచ్చిన స్టాక్ వచ్చినట్లే ఖతం..

రాష్ట్రప్రభుత్వం ఏప్రిల్ కోటా కింద (హైదరాబాద్ మినహా) 1,67,285 మెట్రిక్ లక్షల టన్నుల సన్నబియ్యం కేటాయించింది. పంపి ణీ ఈనెల 1న ప్రారంభం కాగా..  తొలి నాలు గు రోజుల్లోనే 67,255 టన్నుల బియ్యం లబ్ధిదారులకు అందింది. అంటే.. కేవలం నాలుగు రోజుల్లోనే 47.90శాతం పంపిణీ నమోదైందన్న మాట. 17వ తేదీ (గురువారం) వరకు 1,52,710 మెట్రిక్ లక్షల ట న్నుల పంపిణీ పూర్తయింది. గతంలో డీలర్లు నెలలో కేవలం ఒక్కసారి స్టాక్ తెచ్చుకునేవారు. కానీ.. ఇప్పుడు ఒక్కో డీలర్ రెండు, మూడుసార్లు స్టాక్ తెచ్చుకోవాల్సిందంటే లబ్ధిదారుల నుంచి ఎంతటి స్పందన వచ్చిం దో అంచనా వేయవచ్చు.

సోనా మసూరి, బీపీటీ రకాల తరహాలో..

గతంలో దొడ్డుబియ్యం వండితే ముద్ద ముద్దగా ఉండేదని, ఇప్పుడు సర్కార్ పంపి ణీ చేస్తున్న బియ్యం సోనామసూరి, బీపీటీ తరహాలో నాణ్యంగా ఉన్నాయని లబ్ధిదారు లు సంబురపడుతున్నారు. వండిన అన్నం  పొల్లుపొల్లుగా వృద్ధులు, చిన్నారులు తినేందుకు అనువుగా ఉందని హర్షం వ్యక్తం చేస్తు న్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ మందకొడిగా ఉండేదని, ప్రతినెలా 60 70 శాతం వరకే బియ్యం పంపిణీ టార్గెట్ పూర్తయ్యేదని, ఇప్పుడు తెచ్చిన స్టాక్ తెచ్చిన ట్లే ఖాళీ అవుతుందని చెప్తున్నారు.

జిల్లాల్లో పంపిణీ సరళి..

జగిత్యాల జిల్లాలో 3,07,097 రేషన్‌కార్డులు ఉండగా, ఈ నెలకు 5,671 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిం పు జరిగింది. గురువారం 95శాతం పంపిణీ పూర్తయింది.  కరీంనగర్ జిల్లాలో 2,76,930 రేషన్‌కార్డులు ఉండగా, 5 5,160 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు జరిగింది. 92 శాతం పంపిణీ పూర్తయింది. పెద్దపల్లి జిల్లాలో 2,19,712  కార్డు లు ఉండగా, 90 శాతం పంపిణీ పూర్తయిం ది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,73,578 5 కార్డులు ఉండగా, 3,275 టన్నుల బియ్యం కేటాయింపు జరిగింది. 90 శాతం బియ్యం పంపిణీ పూర్తయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,93,754 రేషన్‌కార్డులు ఉండగా, 5,479 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయి ంపు జరిగింది. శుక్రవారం వరకు 4,757 మెట్రిక్  టన్నుల బియ్యం లబ్ధిదారులకు అం దింది.

మహబూబ్‌నగర్ జిల్లాలో 2,44,000 రేషన్ కార్డులు ఉండగా, 528 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు జరిగింది. జిల్లాలో 75శాతం పంపిణీ పూర్తయింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 5 .80 లక్షల లబ్ధిదారులకు 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు జరిగింది. జిల్లాలో ఈనెల టార్గెట్ దాదాపు పూర్తికావొచ్చింది.

బియ్యం మాఫియా.. ఆటకట్టు..

గతంలో లబ్ధిదారులకు ఇచ్చిన దొడ్డు బియ్యమంతా దళారుల పాలయ్యేది. లబ్ధిదారుల నుంచి బియ్యం సేకరించి, వారికి కిలోకు రూ.8 నుంచి రూ.10 చొప్పున మిల్లర్లకు అమ్మేవారు. మిల్లర్లు ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసేవారు. వ్యాపారులు ఆ బియ్యాన్ని తక్కువ ధరకు కొని, రంగు రంగుల బస్తాల్లో బియ్యం బ్యాగులు సిద్ధం చేసేవారు.

అవి సన్నబియ్యమని నమ్మబలికి వినియోగదారులకు ఎక్కువ ధరకు అంటగట్టేవారు. ఇప్పుడు సర్కార్ సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో బియ్యం మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడినట్లయింది. మరోవైపు మార్కెట్‌లో సన్నబియ్యానికి డిమాండ్ తగ్గడంతో ధరలు దిగివచ్చాయి. గతంలో క్వింటా రూ.5 వేలకు పలికిన బియ్యం ధర, ఇప్పుడు రూ.4 వేలకు చేరింది.

సంతోషంగా ఉంది..

రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం సంతోషాన్నిచ్చింది.  మా కుటుంబం లాగానే లక్షలాది కుటుంబాలు సంబురపడుతున్నాయి. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం భేష్. సన్న బియ్యం పంపిణీ పేద ప్రజల కుటుంబాల ఆకలి బాధలు తీరుస్తున్నది.

 ఓదమ్మ, లబ్ధిదారు, ఖమ్మంపల్లి, మండలం ముత్తారం, పెద్దపల్లి జిల్లా 

సన్న బియ్యం ఇస్తరనుకోలేదు..

రాష్ట్రప్రభుత్వం సన్నబియ్యం ఇస్తదని ఎప్పుడూ అనుకోలేదు. మేం గతంలో రేషన్‌షాపుకు వెళ్లి దొడ్డు బియ్యం తెచ్చుకునే వాళ్లం. కానీ.. వండుకుని తినేవాళ్లం కాదు. ఇప్పుడు మేం ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యాన్నే వండుకుంటున్నాం. బయట ఎక్కువ ధర పెట్టి సన్న బియ్యం కొనే బాధ తప్పింది. 

-గీత, లింగంపేట, లబ్ధిదారు, జడ్చర్ల , మహబూబ్‌నగర్ జిల్లా 

సర్కార్‌కు కృతజ్ఞతలు..

నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం సన్నబియ్యం అందజేయడం ఆనందదాయకం. మా కుటుంబానికి కూడా ఇప్పుడు సన్నబియ్యమే అందుతున్నది. ఇప్పుడు సన్నబియ్యమే వండుకుని తింటున్నాం. ఇంత మంచి పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం.

-వెంకటమ్మ, లబ్ధిదారు, షాద్ నగర్, రంగారెడ్డి జిల్లా 

పేదలకు మేలు 

రాష్ట్రప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ అనే మంచి నిర్ణయం తీసుకుని పేదలకు మేలు చేస్తున్నది. డబ్బులున్నవారు, సంపన్నులు తినే సన్నబియ్యాన్ని ఇప్పుడు పేదవారికి చేర్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకం కొనసాగితే బాగుంటుందని కోరుకుంటున్నాం.

గాయత్రి, లబ్ధిదారు, హుజూర్‌నగర్, సూర్యాపేట జిల్లా 

సీఎం రేవంత్ కడుపు సల్లగుండ !

దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అయిష్టంగా తీసుకువెళ్లే వాళ్లం. ఆ బియ్యాన్ని అప్పాల వంటి పిండి వంటలకు వాడేవాళ్లం. అన్నానికి బయట మార్కెట్లో ఎక్కువ ధరకు కొనేవాళ్లం. ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్నది. పేదల కడుపు నింపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి సల్లగుండాలని కోరుకుంటున్నాం. ఇక మాకు ఎక్కువ ధరకు సన్నబియ్యం కొనుక్కునే బాధపోయింది.

మైస యాకమ్మ, కల్వల, లబ్ధిదారు, మహబూబాబాద్ జిల్లా