మనం ఎంత పెద్దవాళ్లమైనా భావోద్వేగాల ముందు అప్పుడప్పుడూ పసివాళ్లమే అవుతాం. ప్రత్యేకించి మనవలు, మనవరాళ్లపై ప్రేమానురాగాల్ని కురిపించడానికి చాలామంది తాతలు పడే ఆరాటం ఇంతా అంతా కాదు. ఒక్కోసారి కుటుంబంలో అదొక ‘ప్రచ్ఛన్న యుద్ధాన్ని’ తలపించినా ఆశ్చర్యం లేదు. సుప్రసిద్ధ హాస్యరచయిత మునిమాణిక్యం వద్ద లేఖకునిగా పని చేసిన కొద్ది కాలంలోనే ఆయన మనసు తడి నాకు బాగా అర్థమైంది. మనవలకు అడపా దడపా ఏవో కొన్ని చిల్లర పైసలు అందించడానికే ఆయన తాపత్రయ పడిన విధానం అనితర సాధ్యం.
అవి నేను ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’లో చదువుకొనే రోజులు. హాస్య రచయిత ముని మాణిక్యం నరసింహారావుతో పరిచయమైంది.
“నేను చెప్తుంటే బాగా రాయగలిగిన విద్యార్థి కావాలి. అలాంటి వాడుంటే నా దగ్గరికి పంపించండి” అని దేవులపల్లి రామానుజారావుని ముని మాణిక్యం వారు కోరారు. దేవులపల్లి వారు ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ కె.కె.రంగనా థాచార్యులను సంప్రదించగా, ఆయన నన్ను పంపించడానికి అంగీకరించారు. అప్పటికి మునిమాణిక్యం గన్‌ఫౌండ్రిలో ఉండేవారు. అది వారికి అద్దె ఇల్లు. అయినా, మంచి బంగ్లా.
“దేవులపల్లి వారు నన్ను పంపించారు” అని చెప్పగానే ముని మాణిక్యం వారు నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. టీనేజ్ పిల్లవాడినైన నా గురించి అన్ని విషయాలూ అడిగి తెలుసుకున్నారు. రోజు విడిచి రోజు, సాయంత్రం గాని లేదా ఉదయం గాని తన దగ్గరకు రావాలి. ఒక గంటసేపు తాను చెప్పింది పొల్లు పోకుండా రాయాలి. ఇంతే. ఇందుకు నేను సంతోషంగా అంగీకరించాను.
ముని మాణిక్యం వారు ‘కాంతం కథలు’ రాసి బాగా సుప్రసిద్ధులయ్యారు. అవి భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని రసమయం చేయగలిగిన అమృత గుళికలు. వారు విశ్వనాథ సత్యనారాయణ వలె భార్యా వియోగాన్ని అనుభవించారు. కనుకే, అంతటి భావోద్వేగాలతో కూడిన రచనలను అందించారు. తర్వాత బంధువుల ఒత్తిడితో మళ్లీ వివాహం చేసుకు న్నారు. రెండో భార్య పేరు రాజ్యలక్ష్మి. ముని మాణిక్యం వారు తన మొదటి భార్యమీది ప్రేమతో, ఆమెకు ‘కాంతం’ అని నామకరణం చేసి, ఎన్నో కథలు యదార్థంగాను, కల్పితంగాను రచించారు.
రాజ్యలక్ష్మి అమ్మ నన్నెంతో ఆప్యాయంగా పలుకరించేవారు. తాను తయా రుచేసిన తినుబండారాలను నాకు కూడా కొద్దిగా పెట్టేవారు. ఐతే, కొన్ని వంటకాల విషయంలో రాజ్యలక్ష్మి అమ్మకు, ముని మాణిక్యం వారికి మధ్య చిన్న తగవులు (తాత్కాలికంగా) ఏర్పడేవి. ముని మాణిక్యం వారు తనకు నచ్చిన వంటకాలను తినాలని అనుకున్నప్పుడు ఆమె సున్నితంగా మందలించే వారు.
“డాక్టరు వద్దన్న విషయం మరిచిపోతే ఎలా? మీకు నేను మళ్లీమళ్లీ జ్ఞాపకం చేయవలసి వస్తుంది. మీకెంత చెప్పినా వినరు కదా. చెప్పిచెప్పి తలప్రాణం తోకకు వస్తుంది..” అనేవారు. ఆమె గొంతులో సూటితనం వున్నా అంతర్గతంగా అనురాగం లేకపోలేదు. అది విని, ఆయన తనలో తనే చిన్నగా నవ్వి ఊరుకునే వారు. కానీ, నాకు మాత్రం వెళ్లినప్పుడల్లా ఏవేవో తినుబండారాలు పెట్టేది. నేను ‘అమ్మా’ అని గౌరవంగా, భక్తిగా పిలిచేవాణ్ణి. ఆమెకు నేను చేయవలసిన సాయం ఒకటుండేది. రేడియో ప్రోగ్రాంలు విని రాజ్యలక్ష్మిఅమ్మ స్పందించేవారు. ఆ స్పందనను నాకు తెలిపితే నేను చక్కగా పోస్టుకార్డు మీద రాసి పోస్టు చేసేవాణ్ణి. ఈ పని ముని మాణిక్యం వారి దగ్గర లేఖకునిగా పని చేసిన మూడేళ్లూ కొనసాగింది.
అప్పుడు మునిమాణిక్యం వారు ‘గాడిదల తిరుగుబాటు’ పేరుతో ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ధారావాహికంగా ఒక నవల రాస్తున్నారు. నేను వారు చెప్పింది రాసి ఒకసారి వినిపించే వాణ్ణి. వారు చేసే సవరణలను నోట్ చేసుకొని శుద్ధప్రతిని తయారు చేసి వారికి అందించేవాణ్ణి. ఆ మహానుభావుడు నాతో ఊరికే నవల రాయించుకోలేదు. నెలలో పదిహేను రోజులు వారివద్దకు వెళ్లేవాణ్ణి కనుక, పదిహేను రూపాయలు భృతిగా ఇచ్చేవారు. ఆ డబ్బు భోజనానికి సరిపోయేది.
అది వెలకట్టలేని ఆత్మీయత
మునిమాణిక్యం వారి ఇంటికి సమీపంలోనే వారి కుమారుడు మురయా (ముని మాణిక్యం రఘునాథ యాజ్ఞవల్క్య) ఉండేవారు. మురయాకు పిల్లలు న్నారు. వారంతా చిన్నవారే. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. ఆ పిల్లలు అప్పుడప్పుడు తాతయ్యను చూద్దామని వచ్చేవారు. వారానికి రెండు రోజులైనా తప్పనిసరిగా వచ్చేవారు. వారు వచ్చినప్పుడు చూడాలి, ఆ తాతా మనవల ఆనందోత్సాహాలు. ఆ ఆత్మీయత, అనుబంధం వెలకట్టలేనివి.
మనవలు, మనవరాళ్లు ఇంటికి వచ్చినప్పుడు వారికి తనవద్ద వున్న కొన్ని చిల్లర నాణేలు ఇవ్వాలని ముని మాణిక్యం వారు ఉబలాడపడేవారు. పిల్లలు ‘పైసలు’ తీసుకొన్నప్పుడు ఆయన ముఖం విచ్చుకొనేది. కళ్లలో ఎంతో తృప్తి కనపడేది. తన దగ్గర చిల్లర పైసలు లేనప్పుడు పసి పిల్లలు వస్తే ఎంతో బాధపడి పోయేవారు.
రచయితలలో హాస్యరచయితలది ప్రత్యేకమైన జీవన పద్ధతి. వారు దేన్నీ అంత సీరియస్‌గా తీసుకునేవారు కాదు. సున్నితంగా దేన్నయినా సాధించడం, పరిష్కరించడం వారికి అలవాటు. అందుకే, మునిమాణిక్యం వారు మనవలు, మనవరాళ్ల కోసం చిల్లర పైసలనుగాని లేదా రూపాయలను ముందే సేకరించి పెట్టుకొనే వారు. వాటిని మరెవరి కంట పడకుండా, తను పడుకొనే పరుపు కిందో, దిండు కిందో దాచేవారు. రోజుకో చోటు మార్చేవారు. ఏ రోజు పైసలు ఎక్కడ దాచిందీ ఎవరికీ తెలియదు, ఆయనకు తప్ప. పిల్లలు వస్తున్నారంటే
“చెన్నప్పా! పరుపుకు ఎడమవైపు చూడమని చెప్పు” అనేవారు. మరొకసారి కుడివైపు వెళ్లమని చెప్పమనేవారు. ఒక్కోసారి పుస్తకాల మధ్య పెట్టి, ఆ పుస్తకం పేరేదో నాకు చెప్పేవారు. అలా, ముని మాణిక్యం గారు ఎంతో చాకచక్యంగా మసలుకొని పిల్లలను సంతోషపెట్టేవారు. ‘ఎందుకీ శ్రమ! నేరుగా పిల్లలను తన దగ్గరకు పిలుచుకొని ఒళ్లో కూచోపెట్టుకొని తానే స్వహస్తాలతో చిల్లర పైసలు ఇవ్వవచ్చు కదా!’ అన్న సందేహం నాకు కలిగేది. కానీ, కారణం వారికే తెలియాలి.
నేను మునిమాణిక్యం వారివద్దకు వెళ్లిన మూడు సంవత్సరాల్లో కొడుకు మురయా వచ్చినట్లు చూడలేదు. ముని మాణిక్యం వారు సామాన్యంగా ఎక్కడికీ వెళ్లేవారు కూడా కారు. ఎటైనా, వెళితే నేను తోడుగా వుండేవాణ్ణి. బయటికి వెళ్లినప్పుడు మాత్రం మేం తప్పక తాజ్‌మహల్ హోటల్‌లో కాఫీ తాగేవాళ్లం. ఇంటికి వచ్చే దారిలో ఒక మెడికల్ షాప్‌లో ‘సారిడన్’ మాత్రలు తప్పక కొనేవాళ్లం. వాటితోపాటు తప్పకుండా ‘చిల్లర నాణాలు’ తీసుకోవడం మరిచిపోయేవారు కాదు. ఎందుకంటే, వాటిని మనవలు, మనవరాళ్లకు ఇవ్వాలని!
మెడికల్ షాప్ యజమాని కూడా ముని మాణిక్యం వారి కోసం కొత్త రూపా యి, అర్ధ రూపాయి, చారాణా నాణేలను తెచ్చి పెట్టేవాడు. ఐతే, చిల్లర నాణేల సంచిని మాత్రం మునిమాణిక్యం వారు ఎక్కడ దాచి పెట్టేవారో ఆ భగవంతునికే తెలియాలి. ఆఖరకు రాజ్యలక్ష్మి అమ్మకు కూడా తెలియదని అనుకుంటాను.
వ్యాసకర్త: సెల్: 9885654381