calender_icon.png 16 November, 2024 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి కాలనీలో ఘనంగా వినాయక నిమజ్జనం

18-09-2024 01:28:40 PM

హైదరాబాద్: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తమ బిడ్డల అభివృద్ధి కోరుతూ అమ్మలతో తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాడు. పిల్లలు, పెద్దలు బొజ్జ గణపయ్యను తమ మిత్రుడిగా భావిస్తూ నిమజ్జనం సమయంలో ఆత్మీయుడిని సాగనంపుతున్నట్లు బరువెక్కిన హృదయ వేదనతో భావోద్వేగానికి గురయ్యారు.  

హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా దండాలయ్యా ఉండ్రాల్లయ్యా.. అంటూ భజనలు చేస్తూ బొజ్జ గణపయ్యను సరూర్ నగర్ చెరువులో నిమజ్జనం చేశారు. సింగరేణి కాలనీ వినాయక నవరాత్రి ఉత్సవాలను గత 50 ఏళ్లుగా నిర్వహించడం విశేషం. మంథని పట్టణానికి చెందిన పలువురు మలక్ పేట, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఏటా ఇక్కడ భక్తి శ్రద్ధలతో  గణేషుడి నవరాత్రులు జరుపుకుంటారు. అమెరికా, స్విట్జర్లాండ్ తదితర  దేశాలలో ఉన్న ప్రవాస భారతీయులు గణ నాథుడి ఆశీర్వాదం కోసం ఖచ్చితంగా ప్రతి ఏటా వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు.

తొమ్మిదిరోజుల పాటు నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా స్వగ్రామానికే ప్రత్యేకమైన ఆహార పదార్థాలైన (సిగ్నేచర్ రిసిపీస్) బోడకాకరకాయ ఫ్రై, ముద్దగూర.. పోణీ నూనె, సెనగ పూర్ణం పుణుకులు, బూరెలు, చల్లా పులుసు, గుమ్మడి కాయ భరడా తదితర వంటలను రుచికరంగా వండి వడ్డించడం ఇక్కడ చూడొచ్చు. పులిహోర, ఆలూ భాత్(ఆలూ బిర్యానీ)లతో పాటు  శ్రీ ఖండూ,  భాసంది, జిలేబీ, ఖోవా జిలేబీ, ఘీవర్ తదితర పసందైన మిఠాయిలను వడ్డిస్తారు. ఈ వంటలను వండి వార్చడానికి ప్రత్యేకంగా గట్టు రమేశ్ అనే వంట బ్రాహ్మణుడు  గత 30 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారని నిర్వాహకుడు పవన్ చంద్ర తెలిపారు. ఈ వేడుకలలో లంబోదరుడిని భక్తుల భజనలు పాటలను డీజే, సౌండ్ లైటింగ్ లతో పాటు డ్రోన్ కెమెరాలతో కార్యక్రమాన్ని చిత్రీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. 

పురోహితుడుగా  శ్రీరాములు సైతం 35 సంవత్సరాలుగా మంథని పట్టణం నుంచి వచ్చి మంత్రపుష్పం, నిత్యపూజలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. గణపతి హోమం, అభిషేకం, రోజూ రెండు పూటల సంపూర్ణ గణపతి పూజను నిష్ఠగా చేస్తారని శ్రీరాములు పేర్కొన్నారు. తమ పెద్దలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని సిద్ధి వినాయక భక్త సమాజం పేరుతో  ఈ సంస్థ నిర్వహిస్తున్నారని చెప్పారు. కాగా ఈ సంస్థను 1971లో ఏర్పాటు చేసిన సంస్థ ఫౌండింగ్ మెంబర్స్,గా వ్యవ్హహరిస్తున్న వారిలో గులుకోట ముత్తయ్య, మార్పాక పురుషోత్తం, సువర్ణ రామన్న, వడవత్త మహదేవ్ కుమారులు, మోహన్ తదితరులు ఉన్నారని పవన్ చంద్ర తెలిపారు.