బెల్లంపల్లి (విజయక్రాంతి): నాగశుద్ధ పంచమిని పురస్కరించుకొని సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. అర్చకులు రుద్రభట్ల శివకుమార్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి పాఠశాలలో పూజ, సంకల్పము, అగ్ని ప్రతిష్టాపణ, సరస్వతి మంత్ర ప్రయుక్తి ఏకాదశి గాయత్రి యజ్ఞం, శ్రీ సరస్వతి అష్టోత్తరం, అక్షరాభ్యాసం కార్యక్రమాలను ఘనంగా జరిపించారు. బెల్లంపల్లితో పాటు కన్నెపల్లి, భీమిని, తాండూర్, కాసిపేట మండలాల నుండి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు పాఠశాలలో నిర్వహించే వసంత పంచమి వేడుకలకు తరలివచ్చారు. వందకు పైగా చిన్నారులు అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాఠశాల కమిటీ కార్యదర్శి కొడిప్యాక విద్యాసాగర్, పాఠశాల ప్రధానాచార్యులు ఇంగు భాగ్యలక్ష్మిల ఆధ్వర్యంలో చిన్నారుల అక్షరాభ్యాసాల కోసం తరలివచ్చిన తల్లిదండ్రులకు త్రాగునీరు, తీర్థ ప్రసాదాలతో పాటు సరస్వతి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. వసంత పంచమి వేడుకల్లో పాలుపంచుకునేందుకు భారీగా మహిళలు తరలి రావడంతో పాఠశాలలోని జ్ఞాన సరస్వతి దేవాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో శిశు మందిర్ పాఠశాలల అకాడమిక్ ఇంచార్జి పూదరి సత్యనారాయణ, ప్రబంధకారిణి సభ్యులు బాల సంతోష్, పుల్లూరి వెంకటేష్, కమల్ లాహోటి, రాజులాల్ యాదవ్, జనహిత సేవా సమితి సభ్యురాలు, రచయిత హనుమాండ్ల రమాదేవి ,మాతృభారతి కోఆర్డినేటర్ కొలుగూరి సౌజన్య, జాగాటి కల్పన, లలితామారు, సుష్మ లాహోటి, పల్లెర్ల సింధుజ, బాల కావ్య, నేహా, పరిమళ, సజ్జనపు శృతి, రాజ్యలక్ష్మి, ప్రియాంక సోమాని, మంతెన లత లతో పాటు పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు పాల్గొన్నారు.