calender_icon.png 28 February, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పెద్ద పట్నం వేడుకలు

28-02-2025 12:33:18 AM

  • నిర్వాహకుల నిర్లక్షం... 
  • పెద్దపట్నానికి ఆలస్యం
  • బారికేడ్లపై దూకిన భక్తులు 
  • అదుపు చేసేందుకు పోలీసుల 
  • యత్నం... స్వల్పంగా గాయాలు 

 చేర్యాల, ఫిబ్రవరి 27:  ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున క్షేత్రంలో పెద్ద పట్నం వేడుకలు తోట బావి వేదికగా ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్స వాల్లో కీలక ఘట్టమైన పెద్దపట్నం వేడుకలు బుధవారం రాత్రి ప్రారంభమై తెల్లవారు జాము వరకు కొనసాగాయి. ఆలయ అర్చకులు లింగోద్భావ కాలంలో గర్భగుడిలో ఉన్న స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించిన తర్వాత పూజారులు పెద్దపట్నం వేడుకలను ప్రారంభించారు.

అయితే అర్థ రాత్రి పట్నాం వేయటం ఆలస్యంగా ప్రారంభించడంతో ఉపవాసం ఉన్న భక్తులు ఓపిక నశించి పట్నం తొక్కేందుకు భక్తులు భారికెట్లు దుకేందుకు ప్రయత్నించారు. పంచ వర్ణాలను వినియోగించి, 41 వరసలతో, 100 మంది  ఒగ్గు పూజారులు శ్రమించి పట్నాన్ని రచించారు. అనంతరం ఆలయ అర్చకులు గర్భగుడిలోని స్వామివారి ఉత్సవ విగ్రహాలను మేళ తాళాల మధ్య ఊరేగింపుగా పట్నం వద్దకు తీసుకువచ్చారు.

తర్వాత పెద్దపట్నం పై విగ్రహాలను పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఉత్సవ విగ్రహాలతో అర్చకులు దాటారు. అనంతరం భక్తులు, శివసత్తులు సిగాలు ఊగుతూ, మల్లన్న స్మరణ చేసుకుంటూ పట్నం దాటి తన్మయత్వం పొందారు. పట్నం దాటిన భక్తులు నేరుగా గర్భగుడిలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.

స్వల్ప ఉద్రిక్తత...

 పెద్దపట్నం జరుగుతున్న తోటబావి ప్రాంతం భక్తుల రద్దీ పెరిగింది. పట్నం వేసేదాకా భక్తులు మల్లన్న కథ విన్నారు. పట్నం వెయ్యడం ఆలస్యం కావడంతో రెండు వైపులా ఉన్న భక్తులు పట్నం దాటడానికి ఒక్కసారిగా భారీకెడ్లను ఎక్కడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపు చేయడానికి చేసిన ప్రయత్నంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దాంతో పోలీసులు కొంతమంది పై లాఠీ ఝులిపించారు.

సుమారు 8 మందికి గాయాలైనట్లు తెలిసింది. ఉద్రిక్తతలో ఇద్దరు ఏసీపీలు అదుపు తప్పి కింద పడిపోయారు. పోలీసులు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో కె.రామాంజనేయులు, ఆలయ ప్రధాన అర్చకులు మహాదే వుని మల్లికార్జున్, పాలకమండలి సభ్యులు లింగంపల్లి శ్రీనివాస్, అంజిరెడ్డి, అల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.