బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు, కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి (కాక) 10వ వర్ధంతి వేడుకలను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఏఎంసి ప్రాంతంలో గల కాకా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాకా వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు నాయకులు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత మాట్లాడుతూ.. బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కాకా వెంకటస్వామి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
దళిత జాతీయ నాయకుడిగా ఎదిగిన తెలంగాణ ప్రాంత ఆణిముత్యమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన కాకా వెంకటస్వామి జయంతి వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడం సంతోషకరమన్నారు. కాకా ఆశయాలను తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కాకా వర్ధంతి వేడుకల్లో బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, టిపిసిసి సభ్యులు చిలుముల శంకర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మల్లారపు చినరాజం, యూత్ కాంగ్రెస్ బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు సన్నీ బాబు, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్, కౌన్సిలర్లు గెల్లి రాజలింగు, బొడ్డు నారాయణ, గుజ్జ రవితో పాటు కాంగ్రెస్ అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.