20-04-2025 08:09:44 PM
మానవతా విలువలు కలిగి మానవులుగా మెలగాలి..
రెవరెండ్ శ్రీనివాస్ సాప..
కామారెడ్డి (విజయక్రాంతి): యేసుక్రీస్తు బోధలు మానవాళికి అనుసరణీయం అని రెవరెండ్ సాప శ్రీనివాస్ అన్నారు. సంగమేశ్వర్ గ్రామంలో ఆదివారం గుడ్ ఫ్రూట్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో, జిఎఫ్ఎం ప్రేయర్ హాల్ లో యేసు క్రీస్తు పునరుద్దానపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. యేసు క్రీస్తు మానవాళి ఆత్మ రక్షణకై మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుత్థానుడైన సందర్భంగా ఆయన సిలువ మరణ, స్థానపు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రెవరెండ్ సాప శ్రీనివాస్ యేసు క్రీస్తు పునరుత్థానపు ప్రత్యేక సందేశాన్ని అందించారు.
యేసు క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను సిలువకు అప్పగించుకొని, ఆయన ప్రజలకు విమోచనము కలుగునట్లుగా విమోచన క్రయధనముగా సిలువ మరణం పొంది, మూడవ దినమున సమాధి నుండి పునరుత్థానుడై మరణము గెలిచినందున మానవాళికి శుభోదయం కలిగిందని వివరించారు. మానవాళి ఇహలోక సంబంధమైన దురాశలను, శరీర ఆశలను, శరీరక్రియలను, ప్రాచీన స్వభావమును, విడిచిపెట్టి మానవతా విలువలు కలిగి కోటి మనిషిని ప్రేమిస్తూ ఆత్మీయంగా పునరుద్దానం కావాలని, బైబిల్ బోధలు అనుసరించి మానవతా దృష్టితో మనుషులందరూ మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాప పవిత్ర, జ్ఞాన్ కుమార్, రాజ్ కుమార్, మోహన్ రెడ్డి కమల, మార్కు మరియమ్మ, రాజు రిభికా, రాజయ్య పున్నమ్మ, భాగ్యమ్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.