- 7, 8, 9 తేదీల్లో వివిధ కార్యక్రమాల నిర్వహణ
- 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం
- సీఎస్ శాంతికుమారి వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాం తి): ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 7,8,9 తేదీల్లో జరిగే ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీఏడీ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు హాజరయ్యారు.
సీఎస్ మాట్లాడుతూ.. డిసెంబర్ 7న ప్రముఖ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ బృందం, 8న ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌చే సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని తెలిపారు. 9న సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, అనంతరం సభా కార్యక్రమం ఉంటుందన్నారు.
గతంలో లేనివిధంగా డ్రోన్ షో, లేజర్ షో, క్రాకర్ ప్రదర్శన అనంతరం సంగీత దర్శకులు తమన్ చే ఐమాక్స్ హెఎండీఏ గ్రౌండ్స్‌లో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలుగు తల్లి ఫ్లు ఓవర్ నుంచి పీవీ మార్గ్ వరకు ఐదు కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికల్లో భిన్న రీతుల సాంస్కృతిక కార్యక్రమాలను ఏ ర్పాటు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఇదే మార్గంలో ఫుడ్ స్టాళ్లు, హస్తకళల స్టాళ్లు, పలు శాఖల స్టాళ్లతో దాదాపు 120 స్టాళ్లను ఏర్పాటుచేస్తున్నట్లు తెలియచేసారు. మూడు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలకు నగరవాసులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశమున్నందున వారికి తగిన ఏర్పాట్లు చే యాలని అధికారులను ఆదేశించారు.
ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.