- పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.1.10 కోట్లు
- నైజీరియన్‌తో సహా ఇద్దరి అరెస్ట్
- వివరాలు వెల్లడించిన సీపీ శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (విజయక్రాంతి): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం పోలీసులు రూ.కోటికిపైగా విలువ చేసే మల్టీపుల్ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఓఫోజోర్ సండే ఎజీకే అలియాస్ ఫ్రాంక్ ఓ కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాడు. 2016లో స్పోర్ట్స్ వీసాపై భారత్‌కు వచ్చాడు. కొంతకాలం న్యూ ఢిల్లీలోని ఆల్ స్టార్స్ ఆఫ్రికన్ స్పోర్ట్స్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
2018లో బెంగళూరుకు మకాం మార్చి ఫుట్ బాల్ మ్యాచ్‌లు ఆడేవాడు. కానీ వచ్చే డబ్బు సరిపోకపోవడంతో డ్రగ్ దందాలోకి దిగి సప్లయర్ అయ్యాడు. ఈ క్రమంలో రాజేందర్‌నగర్‌లో ఉంటూ కార్లలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి గంజాయి రవాణా చేసే పెడ్లర్ అనాస్‌ఖాన్ పరిచయమయ్యాడు. వీరు ముఠాగా ఏర్పడి మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ ద్వారా పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను రవాణా చేయడంతోపాటు అమ్మకాలు చేపడుతున్నారు. బుధవారం వీరి కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు హెచ్‌న్యూ బృందం తో కలిసి బంజారా హిల్స్‌లో వాహన తనిఖీలు చేపట్టారు.
డ్రగ్ సప్లయర్ ఒఫోజోర్ సండే ఏజీకే అలియాస్ ఫ్రాంక్, డ్రగ్ పెడ్లర్ అనాస్ ఖాన్, డ్రగ్ డెలివరీ బాయ్ సైఫ్ ఖాన్ అలియాస్ సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.10 కోట్ల విలువైన 256 గ్రాముల మల్టిపుల్ డ్రగ్స్‌తో పాటు ఒక కారు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. నిందితులు ఎవరికి డ్రగ్స్ సరఫరా చేశారనే అంశంపై లోతైన విచారణ చేపడుతున్నట్లు సీపీ తెలిపారు.