హైదరాబాద్,(విజయక్రాంతి: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి గ్రామ, వార్డు సభలు కొనసాగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల కోసం ఇవాళ్టి నుంచి తుది కసరత్తు జరగనుంది. ఆ నాలుగు ప్రభుత్వ పథకాల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 24 వరకు గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. కొత్త రేషన్ కార్డ్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించి గ్రామ, వార్డు సభల్లోనే లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోని వారు గ్రామ,వార్డు సభల్లో సమర్పించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈనెల 26 నుంచి భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహా 4 కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. గ్రామసభల్లో పకడ్బందీగా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిర్వహించాలని అధికారులను ప్రజా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా పథకంలో పంట పెట్టుబడి సాయం కోసం పంట వేసినా, వేయకున్నా సాగుయోగ్యమైన భూములన్నింటికీ ఏటా ఎకరానికి రూ.12 వేలను రెండు విడతల్లో రైతు భరోసా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సాగు యోగ్యం కాని భూములకు పథకం వర్తించదని స్పష్టం చేసింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం తొలి విడతలో స్థలం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు చేయాలని, స్థలం లేనివారిని గుర్తించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ప్రజా పాలనలో సుమారుగా 80 లక్షల మంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.