calender_icon.png 27 December, 2024 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీకి అంతా సిద్దం

06-12-2024 09:07:20 AM

వార్డులు, ఓటరు జాబితాను సిద్దం చేసిన అధికారులు 

నేడు జిల్లా ఎన్నికల అధికారితో పోలింగ్ స్టేషన్ల ఆమోదం 

జిల్లాలో 585 గ్రామ పంయాతీలు, 4,982 వార్డులు 

ఓటర్లు 6,82,323 మంది  

వికారాబాద్, డిసెంబర్:  గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ కార్యదర్శులు, బీఎల్‌వోలు వార్డుల వారీగా ఓటర్ల జాబితా, వార్డుల విభజన పూర్తి చేశారు. జిల్లాకు సంబందిచిన పంచాయతీ సమగ్ర సమాచారం సిద్దం చేసుకున్న అధికారులు ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. మంగళవారం నాడు గ్రామ పంచాయతీలు, వార్డులు, పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన షేడ్యూల్‌ను విడదుల చేసిన విషయం తెలిసిందే. నేడు (డిసెంబర్ పోలింగ్ స్టేషన్ల జాబితాకు జిల్లా ఎన్నికల అధికారి  ఆమోదం పొందాక ప్రక్రియ మరింత వేగిరం కానుంది.  ఇలా ప్రతి రోజు ఒక కార్యక్రమంతో ఎన్నికల కసరత్తును నిర్వహించి ఈ నెల 17న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఆయా మండలాల ఎంపీడీవోలు ప్రచురించనున్నారు.  ఈ నేపథ్యంలో  పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన బ్యాలెట్ బాక్స్‌లను సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం జిల్లా కేంద్రంలో బ్యాలెట్ బాక్స్‌లు భద్రపర్చిన గోడాంను పరిశీలించారు. ఆయా మండలాల్లో ఉన్న బ్యాలెట్ బాక్స్‌లను జిల్లా కేంద్రానికి తెప్పించి, సరిచేశాక తిరిగి మండలాలకు పంపిచే ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అధికారులు పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం చేయడంతో  పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది.

6,82,323 మంది ఓటర్లు

జిల్లాలో 585 గ్రామ పంచాయతీలు, 4,982 వార్డులు, 6,82,323 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ 585 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు ప్రాణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా ప్రతి విడతలో ఏడు నుండి ఎనిమిది మండలాలను విభజించి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఆయా జీపీల్లో పోలింగ్ కేంద్రాల లొకేషన్లను సేకరించి ఉంచారు. ఆయా మండల స్థాయి అధికారులు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లును పరిశీలించారు. అదనంగా కల్పించాల్సిన ఏర్పాట్లపై గ్రామ కార్యదర్శులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రధానంగా దివ్యాంగుల కోసం ర్యాంపులు వంటి ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు. 

అందుబాటులో 2,980 బ్యాలెట్ బాక్స్‌లు 

పంచాయతీ ఎన్నికలను ఎప్పటి లాగే బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్ బాక్స్‌లను సరిచేయడం ప్రక్రియ మొదలు పెట్టారు. జిల్లాలో మొత్తం 2,980 బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. 2019లో ఇవే బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగించారు. ప్రస్తుతం జిల్లాలో జీపీల సంఖ్య, పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగడంతో అదనంగా ఏమైనా బ్యాలెట్ బాక్స్‌లు అవసర పడతాయా అనే దానిపై సంబంధిత అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. గత అసెంబ్లి ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు సరిపోతాయా లేక పెంచాల్సి వస్తుందా, ఎన్నికల సిబ్బంది ఎంత అవసరం  అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. 

రిజర్వేషన్లపై వీడని ముడి

ఓ వైపు అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికలు చకచక ఏర్పాట్లు చేసుకుంటూ పోతున్నా, రిజర్వేషన్లపై మాత్రం ఇంకా సందిగ్డం వీడటం లేదు. దీంతో ఎన్నికలను పాత రిజర్వేషన్ల ప్రకారం నిర్వహిస్తారా....? లేక రిజర్వేషన్లను మార్చి కొత్త వాటి ప్రకారంగా ఎన్నికలు జరుపుతారా? అనేదానిపై ప్రభుత్వం స్పష్టత నివ్వడం లేదు. దీంతో పంచాయతీ పోరుకు సై అంటున్న ఆశావాహులు రిజర్వేషన్లు తేలక అయోమయంలో పడిపోయారు. ఇదిలా ఉంటే ఇప్పటికే బీసీ కమీషన్ బృందాలు  గ్రామాల్లో పర్యటించి అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు.  సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దాదాపుగా పూర్తి చేసి ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగుతుంది. మరో రెండు మూడు రోజుల్లో  ప్రక్రియ పూర్తయితే కులాల లెక్క పూర్తిగా ప్రభుత్వం వద్ద ఉండే అవకాశం ఉంది. దీని ఆదారంగానే  బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశాకే ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారని, కొత్త రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.