17-04-2025 12:11:42 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): నిబంధనల ప్రకారం వరి తేమ శాతం 14 వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలనీ ఆలస్యం చేస్తే రైతులు నష్టపోతారనీ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి ఆదేశించారు.
బుధవారం ఉదయం నుండి స్థానిక శాసన సభ్యులు పెద్దమందడి, వనపర్తి మండలంలో 18 వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా జిల్లా కలెక్టర్ వనపర్తి మండలంలోని అంకుర్, వెంకటాపూర్, చిమన్ గుంట పల్లి, చిట్యాల కొనుగోలు కేంద్రాలను శాసన సభ్యులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇస్తుందని, అందువల్ల వచ్చిన ధాన్యం దొడ్డు రకమా లేక సన్న రకమా అనేది ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. క్యాలీపర్ మిషన్ ద్వారా ధాన్యం రకాన్ని గుర్తించే విధంగా శిక్షణ ఇవ్వాలని ఏ.పి.యం ను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు కనీస సదుపాయాలు కల్పించాలని, ఎండలు తీవ్రంగా ఉన్నందున తాగునీరు, ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రానికి వచ్చిన వరి ధాన్యం తేమ శాతం నిబంధనలకు అనుగుణంగా ఉంటే వెంటనే కొనుగోలు చేయాలని లేకుంటే రైతుకు బాగా నష్టపోతారని వారు సూచించారు. రైతులు సైతం తేమ శాతం, తూకం విషయంలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కొనుగోలు ప్రారంభించాలని నిర్వాహకులను వారు ఆదేశించారు. మార్కెట్ యార్డు చైర్మన్ పి. శ్రీనివాస్ గౌడ్, సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామకృష్ణా రెడ్డి , తహసిల్దార్ రమేష్ రెడ్డి, మాజీ ఎంపిపి లు కిచ్చా రెడ్డి, శంకర్ నాయక్, స్థానిక రైతులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.