27-03-2025 12:58:47 AM
కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట. మార్చి 26(విజయక్రాంతి) : రబీ 2024 -25 కు గాను ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని విసి హాల్ లో వరి కొనుగోళ్ళు - కేంద్రాల ఏర్పాట్లపై ఆమె సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి రబీ సీజన్ కు గాను జిల్లాలో వరి సాగు అంచనా, దిగుబడి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎన్ని వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశారని అడిగారు. ఈ సారి సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం అదనంగా రూ. 500 బోనస్ పెంచిందని ఆమె తెలిపారు.
ఈసారి బోనస్ వస్తుండటంతో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఎంతో పారిదర్శకంగా, నిబంధనల ప్రకారం సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆమె సూచించారు. కాగా ఈ జిల్లాలో రబీ సీజన్ కి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉండవచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేసినట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్ కలెక్టర్ కు తెలిపారు.
అయితే ఏప్రిల్ రెండో వారంలోb కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఐకెపి, సింగిల్ విండో, మెప్మా ద్వారా జిల్లాలో దాదాపు 102 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఆయా కేంద్రాల ద్వారా లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
కొనుగోలు కేంద్రాలను అనుకూలమైన ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని, ధాన్యం సేకరణకు అవసరమైన తేమ శాతం కొలిచే యంత్రాలు, టార్ఫాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని, ఇంకా అవరమైన వాటి కోసం ఇండెంట్లు పెట్టి తెప్పించుకోవాలని ఆమె సూచించారు. అయితే కాంటాలు, టార్ఫాలిన్ల కు సంబంధించి మార్కెటింగ్ శాఖ అధికారులు ఇచ్చిన నివేదికలు తప్పుగా ఉన్నాయని, వాటిని వెంటనే సరిచేసి పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని డిఎంఓ ను కలెక్టర్ ఆదేశించారు. దాదాపు 102 కొనుగోలు కేంద్రాలకు 3 వేల టార్ఫాలిన్లు అవసరం అవుతాయని ఆమె చెప్పారు.
కేంద్రాలలో సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేసే సమయంలో నిర్వాహకులు జాగ్రత్తగా ఉండాలని, సన్న రకం కు బదులు దొడ్డు రకం కొనుగోలు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే వరి కొనుగోలు కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లాలో ప్రధానంగా ఐదు రకాల సన్న రకం వడ్ల సాగు ఉందని, అందులో మరీ ముఖ్యంగా బి.పి.టి, ఆర్.ఎన్.ఆర్ సన్న రకం ధాన్యమే అధికంగా కేంద్రాలకు వస్తాయని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. సమీక్షలో ఆర్డీఓ రామచంద్ర నాయక్, డిఆర్డిఓ మొగులప్ప, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్,సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సైదులు, జిల్లా సివిల్ సప్లై బాల్ రాజ్, ఆర్టీవో మేఘా గాంధీ, డి ఎం ఓ బాలమణి, అడిషనల్ డిఆర్డిఓ అంజయ్య, సింగిల్ విండో అధికారులు పాల్గొన్నారు.