22-03-2025 10:00:57 PM
స్థానిక తహసీల్దార్...
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రములో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఈ యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, విధి విధానాల గురించి తహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గత వానాకాలంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా సోమవారం వరకు తుది జాబితా తెలియజేయాలని, వరి కోతలు ఇప్పటికే ప్రారంభమైనందున వేగవంతంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసుకుని, రైతులకు అవగాహన కలిగించి, కొనుగోలు ప్రారంభం చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు.
రైతులకు నాణ్యత ప్రమాణాలు, తేమ శాతంపై అవగాహన కలిగించి, తేమ వచ్చిన వెంటనే కాటాలు వేయించి, మిల్లులకు పంపించాలని, రైతు వివరాలు ట్యాబ్లలో నమోదు చేసి, రైతులకు త్వరగా మద్దతు ధరతో పాటు బోనస్ కూడా వచ్చేలాగా సెంటర్ నిర్వాహకులు కృషి చేయాలనీ, మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కలిసి విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రమేష్ దీనదయాల్, మండల వ్యవసాయ అధికారి రాజు, మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఐకెపి శాఖ ఏపిఎం నగేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు రేష్మ, భవాని, నాగు, సహకార సంఘాల సీఈవోలు బసవయ్య, సుధాకర్ వారి సిబ్బంది పాల్గొన్నారు.