calender_icon.png 30 April, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రం లేక అన్నదాతల ఆందోళన

28-04-2025 09:57:22 PM

వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్..

మందమర్రి (విజయక్రాంతి): మండలంలో వరి ధాన్యం పండించిన అన్నదాతల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వివిధ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా నామమాత్రంగా ధాన్యం  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అదికారులు చేతులు దులుపుకున్నారనే విమర్శలు అన్నదాతల నుండి వ్యక్తం అవుతున్నాయి. మండల వ్యాప్తంగా 10 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రస్తుత రబీ సీజన్లో సుమారు 4200 ఎకరాల్లో వరి ధాన్యం సాగు చేయగా సుమారు 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశాలున్నాయి.

దిగుబడి అయిన ధాన్యమును రైతుల నుండి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాల్సి ఉన్నప్పటికీ మండల పరిధిలో సరైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వ్యక్తం అవు తున్నాయి. గతంలో వరి  ధాన్యం అధికంగా పండించే ప్రతి  గ్రామపంచాయతీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి నేరుగా ధాన్యం కొనుగోలు చేసిన అదికారులు ప్రస్తుతం మండల వ్యాప్తంగా రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం మూలంగా అన్నదాతలు కొనుగోలు కేంద్రాలకు బదులు నేరుగా మిల్లులకు ధాన్యాన్ని తరలించి ఆర్థికంగా నష్ట పోవాల్సి వస్తుందని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండే కొనుగోలు కేంద్రాలు...

మండల వ్యాప్తంగా 10 గ్రామపంచాయతీలుగా కేవలం రెండు గ్రామపంచాయతీలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో మిగితా గ్రామాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా సారంగపల్లి లో, మండల కేంద్రానికి సుదూర ప్రాంతంలో  ఉన్న బొక్కలగుట్ట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలు ఏర్పాటు చేసిన అధికారులు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఏర్పాటు మరవడంతో అక్కడి ప్రజలు, అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతంలో గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు ప్రస్తుతం వాటిని విస్మరించడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో అందుగులపేట, నార్లాపూర్, రామకృష్ణాపూర్ (వి) గ్రామాలకు చెందిన అన్న దాతల సౌకర్యార్థం అందుగులపేట్ గ్రామంలో, పొన్నారం, ఆదిల్ పేట  గ్రామాల అన్నదాతలకు సౌకర్యంగా పొన్నారం లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అదికారులు ప్రస్తుతం రెండే కేంద్రాలు ఏర్పాటు చేయడం పట్ల మండల రైతులు అధికారుల తీరూపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు సరిపడా లేకపోగా ఉన్న వాటికి పండించిన ధాన్యాన్ని తరలించిన అన్నదాతలు సకాలంలో వాటిని మిల్లులకు తరలించక పోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సి  వస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే కొనుగోలు కేంద్రానికి తరలించిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు అకాల వర్షాలు మూలంగా కొనుగోలు కేంద్రాలు తరలించిన ధాన్యం తడిసి ముద్ద అవుతుందని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి  గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు  తరలించి అన్నదాతల ఇబ్బందులు తొలగించాలని  పలువురు రైతుల కోరుతున్నారు.

పొన్నారంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి 

మండలంలోని పొన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామ రైతులు డిమాండ్ చేశారు. గ్రామంలో కొనుగోలు కేంద్రం లేక  రైతులు పండించిన ధాన్యాన్ని దూర ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి తరలించడం ఆర్థికంగా బారం అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా పిఎసిఎస్  ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన అధికారులు ప్రస్తుతం  విస్మరించడం పట్ల రైతులు అధికారులపై ఆగ్రహం కట్టలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామ రైతులు పెంచాల మధు, చిందం మల్లేష్, పెంచాల అంజన్న, కోట్ల రాజయ్య, తోట నారాయణ, పెంచాల రంజిత్, జాడి చంద్రయ్య, జాడి మల్లక్క, పెంచాల రాజన్నలు కోరారు.