22-04-2025 12:00:00 AM
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని ముత్యంపేట్ ప్యాక్స్ సెంటర్, మెట్లచిట్టాపూర్ ఐకెపి ధాన్యం సెంటర్లను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీరియల్ నెంబర్ ప్రకారం రైతుల దగ్గర నుంచి నాణ్యమైన పంట కొనుగోలు చేయాలని, ధాన్యం తరలింపు కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే జరగాలని, ఎప్పటి కప్పుడు ధాన్యం తరలింపు జరిగేలా వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ధాన్యం తరలింపు అంశంలో రవాణా సమస్య రాకుండా అవసరమైన లారీలను. కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచు కోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్లో డాటా ఎంట్రీ చేయాలన్నారు. ధాన్యం నాణ్యత ప్రమాణాల పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాల్ కు 2320 రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్ కు రు. 2300 వస్తాయన్నారు.
కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేపట్టాలని అన్నారు. కలెక్టర్ వెంట మెట్పల్లి ఆర్డీవో ఎన్.శ్రీనివాస్, డిఆర్డిఓ పిడి రఘువరన్, ఎమ్మార్వో శ్రీనివాస్, ఎంపీడీవో, సివిల్ సప్లై అధికారులు, తదితరులున్నారు.