29-04-2025 01:04:57 AM
కొనుగోళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటాం...
జిల్లా కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 28 ( విజయక్రాంతి ) : సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల తీరును పర్యవేక్షించేందుకు భువనగిరి మండలం నందనం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోళ్లు సెంటర్, వలిగొండ మండలంలోని సంగెం గ్రామం లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలాగే చౌటుప్పల్ మండలం నక్కలగూడెం గ్రామంలో పిఏసిఎస్, పెద్దకొండూరు గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని పరిశీలిస్తూ ... రైతులతో మాట్లాడారు . వసతుల కల్పనపై రైతులను అడిగి తెలుసుకుంటూ, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నారు.
రైతులు అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా ముందస్తుగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తేవాలన్నారు. తదనంతరం అధికారులతో మాట్లాడుతూ రైతుల తెచ్చిన ధాన్యాన్ని ప్రతిరోజు తేమ శాతాన్ని పరిశీలించి రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. రిజిస్టర్ లో రైతు పేరు ధాన్యం వివరాలు సెల్ నెంబరు తప్పనిసరిగా ఉండి తీరాలన్నారు. తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేస్తూ అదేరోజు రవాణా చేపట్టి మిల్లర్లకు తరలించాలన్నారు.