19-04-2025 09:41:52 PM
సన్న బియ్యం పంపిణీపై అసత్య ప్రచారం మానుకోవాలి..
కొండపాక: హైదరాబాద్ సివిల్ సప్లై కార్యాలయం నుంచి శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి సీతక్క, పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహన్, ఇతర అధికారులతో కలిసి రబి 2024-25 పంట సాగు, సన్న బియ్యం పంపిణీ, తాగునీటి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో వానాకాలంలో 153లక్యలు, యాసంగి లొ 127.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేశామని తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులను అభినందిస్తూ ఇదే విధంగా కొనసాగాలని క్షేత్రస్థాయిలో సమీక్షిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, బోనస్ పంపిణీ, సరిపడా గన్ని సంచులు మొదలైనవి అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని, పంట పూర్తిగా వచ్చిన తరువాతే హార్వెస్టింగ్ జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. దొడ్డు, సన్న రకాల ధాన్యాన్ని వేరువేరుగా తీసుకొని నమోదు చేసి, పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ అందిస్తున్నామని, దీనిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, అలాంటి తప్పుడు వార్తలు ప్రచారం జరిగినట్లు గుర్తించినట్లయితే వారిపై తగు చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలులో ఇబ్బందులకు గురి చేస్తూ, ఆలస్యం చేసే వారిపై పిడి యాక్ట్ అమలు చేయాలని తెలిపారు.జిల్లాలో తాగునిటీ సమస్య లు రాకుండా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహన్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం అన్నం ముద్దగా అవుతుందని, నూకల శాతం ఎక్కువగా ఉందని, సమస్యలు సృష్టిస్తున్నారని కొత్త బియ్యం కాబట్టి సన్న బియ్యంతో అన్నం వండేటప్పుడు కొంత తక్కువ నీటిని, రెండు చుక్కల నూనె ను వాడితే అన్నం ముద్దగా కాకుండా ఉంటుందని సూచించారు. జిల్లా బోర్డర్ లొ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం దిగుబడి, ఎగుమతి కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మహమ్మద్ హామీద్, డిపిఓ దేవకీదేవి,డిఆర్ డిఓ జయదేవ్ ఆర్య, సివిల్ సప్లై ఆఫీసర్ తనూజ ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.