calender_icon.png 9 April, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం సేకరణ వివరాలను పక్కాగా నమోదు చేయాలి

05-04-2025 02:37:47 AM

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్, ఏప్రిల్ 04 : (విజయ క్రాంతి) :  కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిష్టర్ లలో నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని అన్నారు.

రెంజల్ మండలం దూపల్లి, దండిగుట్ట, రెంజల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ప్రతిరోజు ఎంత పరిమాణంలో వరి ధాన్యం సేకరిస్తున్నారు, ఎన్ని లారీల లోడ్ల ధాన్యం రైస్ మిల్లులకు పంపించారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. దూపల్లి, దండిగుట్ట కొనుగోలు కేంద్రాలలోని రిజిస్టర్లలో  వివరాలు సరిగా నమోదు చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.

రిజిస్టర్లలో విధిగా వివరాలు రాయాలని, రైతులకు కూడా ధాన్యం రకం, ఎంత పరిమాణంలో వారి నుండి ధాన్యం సేకరించారు తదితర వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలని ఆదేశించారు. ట్రక్ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని అన్నారు. ప్రతి కేంద్రంలో సరిపడా గన్ని బ్యాగులు, గ్రెయిన్ క్యాలీపర్లు, మాయిశ్చర్ మీటర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవా లని అధికారులను ఆదేశించారు.

ఈ సీజన్ లోనే తొలిసారి కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న ఐకేపీ మహిళా సంఘాలకు ధాన్యం సేకరణ ప్రక్రియలో సహకారం అందించాలని సొసైటీల సీఈఓ లకు సూచించారు.  రబీ సీజన్ ధాన్యం సేకరణ కోసం ఈసారి జిల్లాలో 700 పైచిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 100 వరకు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

వరి కోతలు పూర్తయ్యి, ధాన్యం దిగుబడులు రావడం ప్రారంభం అవుతున్న విధంగా ఆయా ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈసారి సుమారు యాభై శాతం వరకు కేంద్రాలను ఐకేపీ మహిళా సంఘాల  రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్నట్లయితే, వెంటనే తూకం జరిపి, నిర్దేశిత రైస్ మిల్లులకు పంపడం జరుగుతోందని అన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ సాయాగౌడ్, డీఎస్‌ఓ అరవింద్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్, డీపీఎం సాయిలు, తహసీల్దార్ శ్రవణ్ కుమార్, ఐకేపీ ఏపీఎం చిన్నయ్య తదితరులు ఉన్నారు.