calender_icon.png 8 April, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దారిలో ధాన్యం.. ప్రయాణం ప్రమాదం

08-04-2025 01:22:45 AM

  1. రోడ్లపై ధాన్యం రాశులు పోస్తున్న రైతులు
  2. ప్రమాదాల భారిన పడుతున్న వాహనదారులు

సూర్యాపేట, ఏప్రిల్7 (విజయక్రాంతి): యాసంగి వరి కోతలు మొదలయ్యాయి. వరి కోతలకు ఎక్కువ మంది రైతులు యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. యంత్రాలతో కోతల కారణంగా ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో తప్పనిసరిగా ధాన్యాన్ని ఆరబెట్టాల్సిన పరిస్థితి ఉంది.

కొందరు రైతులు పంట పోలాలలో, లేక కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని ఆరబోస్తుండగా మరి కొంత మంది తమకు అనుకూలంగా ఉంటుందని రహదారులపైన ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డులో కొంత మేర ఆక్రమించడంతో వాహనదారులు ఏమరపాటుగా వ్యవహరించి ప్రమాదాలకు గురవుతున్నారు. 

వరి కోతలు ప్రారంభమైతే వనుకే...

వరి కోతలు ప్రారంభమైతే చాలు.. వాహనదారులు వణికిపోతున్నారు. ధాన్యంలో తేమశాతం అధికంగా ఉండటంతో జిల్లాలో రైతులు ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోస్తున్నారు. ఏటేటా వరి సాగు పెరగడం ధాన్యం దిగుబడి లక్షల క్వింటాళ్లకు చేరుకోవడంతో ధాన్యం ఆరబెట్టుకునేందుకు కల్లాలు లేక రైతులు రోడ్లపైనే ఆధారపడుతున్నారు.. ఈ రోడ్లనే కల్లాలుగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ కారణంగా ప్రమాదాలు జరిగి పలువురు చనిపోయిన ఘటనలు జిల్లాలో ఉన్నాయి. గత ఏడాది సూర్యాపేట జనగాం రహదారిపై బాలెంల సమీపంలో  ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోసి అడ్డుగా రాయి పెట్టడంతో ద్విచక్ర వాహనం రాయిని ఢీకొట్టడంతో వాహనదారుడు ప్రమాదానికి గురై మృతి చెందాడు..

చివ్వెంల మండలం వట్టి ఖమ్మంపహడ్ సమీపంలో ఒక వ్యక్తి, తుంగతూర్తి పరిధిలోని వెలుగుపల్లి వద్ద మరో వ్యక్తి ఇలాంటి ప్రమాదంలోనే మృతి చెందారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఈ నేపథ్యంలో రైతులు, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

రైతులు తీసుకోవల్సిన జాగ్రత్తలు

రోడ్లకు ఇరువైపులా ధాన్యం ఆరబోయొద్దు. అత్యవసరం అనుకుంటే తారు రోడ్డు పక్కన మట్టిదారిలో ఒక వైపు మాత్రమే ఆరబెట్టాలి. రహదారులపై ధాన్యం రాశులను కుప్పలుగా ఏర్పాటు చేసి వాటిపై నల్ల పరదాలు కప్పి బండరాళ్లు పెట్టొద్దు.

దీంతో రాత్రి వేళలో అవి కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. తెల్లటి పరదాలు కప్పి ఉంచాలి. దారులపై పూర్తిగా ఆరబోయడంతో ధాన్యంపై వాహనాలు ప్రయాణించే సమయంలో జారి అదుపు తప్పే అవకాశముంది. నిలబడి పనులు చేయొద్దు. ఒకవేళ రోడ్డుపై ధాన్యం ఉంటే వాహనదారులు నెమ్మదిగా రాకపోకలు సాగించాలి.

రోడ్లపై ధాన్యం రాశులు పోయోద్దు..

రైతులు రోడ్లపై ధాన్యం రాశులను పోయరాదు.  ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను చదు.. చేయించి అక్కడ ఆరబోసుకోవాలి. కొనుగోలు కేంద్రాల ఆవరణలో, పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో ఆరబోస్తే తేమశాతం తగ్గిన తర్వాత అక్కడే విక్రయించుకోవచ్చు. రోడ్లపై ఆరబోసిన ధాన్యం కుప్పలతో ఎవరైనా వాహనదారు ప్రమాదానికి గురైతే ధాన్యం ఆరబోసిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తాం. నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాం.

  నరసింహ, జిల్లా ఎస్పీ