calender_icon.png 24 September, 2024 | 3:48 PM

డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వం

24-09-2024 12:31:27 AM

7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

సన్నాలకు రూ.500 బోనస్ 

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): గతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ఈ ఏడాది ధాన్యం ఇచ్చేది లేదని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖమంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో 2023 ఖరీఫ్ పంట కొనుగోలుపై అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం దిగుమతి కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈఖరీఫ్‌లో 60 లక్షల 39 వేల ఎకరాల్లో వరిసాగైందని, 91లక్షల 38 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రావొచ్చని అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అందుకు అనుగుణంగా రాష్ర్ట వ్యాప్తంగా 7,139 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 4,496, ఐకేపీ కేంద్రాల ద్వారా 2,102, ఇతరుల ద్వారా 541 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

దొడ్డు, సన్నాలకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలుకు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రానికి వెన్నెముక అయిన రైతాం గాన్ని సన్నాల వైపు ప్రోత్సాహించేందుకు వీలుగా రూ.500 బోనస్ అందిస్తున్నామన్నారు. ఈ హామీని ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అమలు చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబరు మొదటి వారంలో మొదలయ్యే ధాన్యం కొనుగోళ్లు జనవరి చివరి వరకు కొసాగుతాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆయన ప్రకటించారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు వీలుగా గోదాంలను సిద్ధం చేసినట్లు చెప్పారు.

జనవరి నుంచి సన్నబియ్యం..

జనవరి నెల నుంచి రాష్ర్టవ్యాప్తంగా అన్ని చౌకధరల దుకాణాల్లో సన్న బియ్యం అందించనున్నట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. దీనితో సుమారు 2 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. ఒక్కక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ ఉంటుందన్నారు. ధాన్యం కొనుగోలులో అధికారుల పాత్ర కీలకమని, ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు ల క్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖా ముఖ్య కార్యదర్శి డీఎస్ చవాన్, జాయింట్ సెక్రటరీ ప్రియాం క అలా, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీ, మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.