17-12-2024 12:22:15 AM
హైదరాబాద్, డిసెంబర్ 1౬ (విజయక్రాంతి): ‘మీరు చేసేది మీరు చేసుకోండి.. మేం మాత్రం సహకరించం’ అన్న రీతిలో రై స్ మిల్లర్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయ నేతల అండదండలతో ఎప్పటిలాగానే దోపిడీకి దందా తెరలేపారు. పౌర సరఫరాల శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సీఎంఆర్ బియ్యాన్ని ప్రైవేట్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.
పౌర సరఫరాలశాఖ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో మిల్లుల్లో దాడులు చేయించింది. ధాన్యం నిల్వలను బహిరంగ మార్కెట్‌కు మళ్లించిన 15 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయించింది. ధాన్యం నిల్వలు ఎక్కడ ఉన్నాయి? అని అధికారులు నిలదీయగా.. ‘మిల్లుల్లో ధాన్యం నిల్వ ఉంచేందుకు తగినంత స్థలం లేదు.
ఇతర ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వ ఉంచాం’ అని బొంకడం కొసమెరుపు. అంతేకాదు.. మిల్లర్లు తనిఖీలు జరిగిన తర్వాతి రోజే బడా రాజకీయ నేతలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కాల్ చేయిస్తూ అధికారులను బెదిరిస్తుండటం గమనార్హం.
అధికార పార్టీ నేత ఒకరు ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని మిల్లలను లీజుకు తీసుకుని నడిపిస్తుండగా, ఇటీవల అధికారులు ఆ మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం లేకపోవడంతో సిబ్బందిని నిలదీయగా. ‘మీరేం చేయగలరో చేసుకోండి. మేం ఏం చేయగలమో చేసుకుంటా’మని చెప్పడం చర్చనీయాంశమైంది.
ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా..
రాష్ట్రప్రభుత్వం బ్యాంక్ గ్యారెంటీ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు గతంలో ధాన్యం ఎగొట్టిన మిల్లర్లపై కఠిన నిబంధనలు తీసుకోవడంపై మిల్లర్ల సంఘం కినుక వహించింది. నిబంధనలు కఠినతరమయ్యాయని మిల్లర్లు కొన్నాళ్లు సర్కార్‌కు సహాయ నిరాకరణ చేశారు. సర్కార్ మిల్లర్లు ధాన్యం తీసుకోకుంటే పక్క రాష్ట్రాల మిల్లర్లకు ఇస్తామని హెచ్చరించడంతో దిగొచ్చారు. ఒక దఫా ధాన్యం తీసుకుని రెండో విడతకు ససేమిరా అంటున్నారు.
టార్గెట్ సుదూరం..
వానకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని యంత్రాంగం అంచనా వేసింది. రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు రూ.20 వేల కోట్లు కేటాయించింది. 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని, అందులో 47 లక్షల టన్నులు సన్నాలు కాగా, 44 లక్షల టన్నులు దొడ్డు రకం కోసం టార్గెట్ నిర్దేశించుకున్నది. కానీ, ఆశించినమేర సన్నాల సేకరణ జరగడం లేదు.
37 లక్షల మెట్రిక్ టన్ను సన్నాలు సేకరించాలని టార్గెట్ నిర్దేశించుకుని, సేకరించిన మరపట్టించి వచ్చిన 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలను రేషన్ దుకాణాలకు తరలించాలనుకుంది. ఇప్పటివరకు కేవలం 19 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. రైతులు పెద్దమొత్తంలో ప్రైవేటుకు విక్రయిస్తుండడంతో సర్కార్ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా మిల్లులు ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా 3,309 రైస్ మిల్లులు ఉండగా, వీటిలో 1,668 మాత్రమే ‘రా’ రైస్ మిల్లులు మనుగడలో ఉన్నాయి. వీటి లో 160 మిల్లుల యాజమనులు డిఫాల్టర్లు. మరో 200 మిల్లులు బ్యాంక్ డిపాజి ట్‌కు ముందుకు రాలేదు. కొన్ని మిల్లులు బ్యాంక్ అప్పులు, దివాళా తీయడంతో అవి కూడా మూత పడ్డాయి.
కేవలం 1,500 మిల్లుల యాజమాన్యాలు మాత్ర మే బ్యాంకు గ్యారెంటీలు, ష్యూరిటీలు ఇచ్చాయి. ప్రభుత్వం ఆయా మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించింది. నవంబర్ రెండోవారంలో అధికారులు ఒక మిల్లుకు సగటున 50- 70 టన్నుల వరకు సీఎంఆర్ కేటాయించారు. మిల్లర్లు సైతం గడువులోపు సర్కార్‌కు బియ్యం అప్పగించారు.
కానీ, రెండో విడత ధాన్యం కేటాయింపుల్లోనే మిల్లర్లు దోపిడీకి తెగబడినట్లు విమర్శలున్నాయి. ఇప్పటివరకు 10.75 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు ధాన్యం, 6.50 లక్షల మెట్రిక్ టన్నులు సన్నధాన్యం సీఎంఆర్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మిగతా ధాన్యాన్ని సమీపంలోని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు.